గంజాయితో పట్టుబడిన ఐస్ క్రీమ్ వ్యాపారి

52
Cannabis smuggling

దిశ, నేరేడుచర్ల : ఐస్ క్రీమ్‌లు అమ్ముకునే వ్యక్తి గంజాయిని రవాణ చేస్తూ పోలీసులకు చిక్కాడు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంజాయితో వెళ్తూ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలను హుజూర్‌నగర్ సీఐ రామలింగారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..

నేరేడుచర్ల పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద గురువారం ఎస్ఐ విజయప్రకాష్, ట్రైనీ ఎస్ఐ అభిలాష్ పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆటోలో కిరణ్ సిరిరంగారావు పుండిగే(29) వద్ద 12.8 కేజీల గంజాయి లభించింది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ముంబయిలోని పర్‌బాని పట్టణానికి చెందిన కిరణ్‌గా చెప్పాడు. శుభకార్యాలకు ఐస్ క్రీంలు సరఫరా చేస్తుంటానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఒడిశా రాష్ట్రానికి చెందిన గంజాయి వ్యాపారి సుమిత్రతో పరిచేయం ఏర్పడిందని వివరించాడు.

హైదరాబాద్‌లో ఉంటున్న సుమిత్ర ఈనెల 9న కిరణ్‌ను పిలిపించుకొని రూ.3 వేలు ఇచ్చింది. విజయవాడలో ఉన్న గంజాయిని హైదరాబాద్ తీసుకురావాలని, ఇలా తెస్తే ప్రతి రోజు రూ.5 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. డబ్బులు ఎక్కువగా వస్తుండడంతో దీనికి కిరణ్ ఒప్పుకున్నాడు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నేరుగా కాకుండా నేరేడుచర్ల మీదుగా తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 12.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని తహసీల్దార్ సరిత సమక్షంలో పంచనామ నిర్వహించారు. అనంతరం కిరణ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ రామలింగారెడ్డి తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..