అంతర్జాతీయ క్రికెట్‌లో కొవిడ్ రూల్స్ కంటిన్యూ

by  |
అంతర్జాతీయ క్రికెట్‌లో కొవిడ్ రూల్స్ కంటిన్యూ
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌ను కొవిడ్ మమమ్మారి తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. అన్ని క్రీడలతో పాటు క్రికెట్ కూడా స్తంభించిపోయింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాత్కాలికంగా కొన్ని నిబంధనలు తీసుకొని వచ్చింది. గత ఏడాది జులైలో వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. అప్పటి నుంచి ఐసీసీ తాత్కాలిక నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం బంతిపై ఉమ్మి పూయడాన్ని నిషేధించారు. మొదటి సారి పూస్తే అంపైర్లు హెచ్చరిక జారీ చేస్తారు. రెండు హెచ్చరికల తర్వాత కూడా సదరు టీమ్ అదే తప్పు చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభిస్తాయి.

అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ప్రతీ మ్యాచ్‌కు న్యూట్రల్ అంపైర్లను నియమించడం కష్టంగా మారింది. దీంతో మ్యాచ్‌లో ఏ దేశంలో జరిగితే ఆ దేశానికి చెందిన ఐసీసీ అంపైర్లను వినియోగించుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది. కాగా, ఈ నిబంధనలు మార్చి 31 వరకు అమలులో ఉంటాయని ఐసీసీ గత ఏడాది ప్రకటించింది. తాజాగా ఈ నిబంధనలు జులై 31 వరకు పొడిగిస్తూ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్స్ కమిటీ (సీఈసీ) నిర్ణయం తీసుకుంది.

అంపైర్ల విషయంలో కొత్త నిబంధనలు..

గత ఏడాది జూలై నుంచి ఐసీసీ తాత్కాలిక నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ రూపొందించిన తాత్కాలిక నిబంధనలే ప్రస్తుతం అమలులో ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలో ఐసీసీ క్రికెట్ కమిటీ మరోసారి ఆన్‌లైన్ ద్వారా భేటీ అయ్యింది. ఇందులో పలు విషయాలపై చర్చజరిగింది. గతంలో ఉన్న కొవిడ్ నిబంధనలు యధాతథంగా కొనసాగిస్తూనే.. అంపైర్ల విషయంలో మరో విధానాన్ని రూపొందించింది. హైబ్రీడ్ మోడల్‌గా పిలుచుకునే ఈ అంపైరింగ్ విధానం ఆయా దేశాల కోవిడ్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

ఐసీసీ ఎలైట్ ప్యానల్ అంపైర్లు నివసించే దేశంతో పాటు మ్యాచ్‌లు జరిగే దేశాల మధ్య అంతర్జాతీయ ప్రయాణాలకు ఎలాంటి ఆంక్షలు ఉండకుండా.. క్వారంటైన్ నిబంధన కూడా సడలించే విధంగా ఉంటే న్యూట్రల్ అంపైర్లను అనుమతిస్తారు. అంపైర్లు కచ్చితంగా ఎలాంటి ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉండటానికి వీళ్లేకుండా ఉండాలి. అయితే బయోబబుల్‌లోకి ప్రవేశించడానికి మాత్రం ఆయా అంపైర్లు క్వారంటైన్ గడపవచ్చు. దీన్నే హైబ్రీడ్ మోడల్ న్యూట్రల్ అంపైరింగ్ పేరుతో పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను క్రికెట్ కమిటీ ఐసీసీకి పంపించింది. ఈ ప్రతిపాదనలకు కూడా సీఈసీ పచ్చజెండా ఊపింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది.

సాఫ్ట్ సిగ్నల్‌పై చర్చించండి..

ఇంగ్లాండ్-ఇండియా సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది సాఫ్ట్ సిగ్నల్. ఫీల్డ్ అంపైర్లు ఇచ్చే ఈ సిగ్నల్ వల్ల ఇండియా కొంచెం నష్టపోయింది. ఈ నిబంధన అనవసరమని కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బహిరంగంగా వ్యాఖ్యానించాడు. మరోవైపు సాఫ్ట్ సిగ్నల్‌పై పూర్తి స్థాయి చర్చ జరిపి తుది నిర్ణయానికి రావాలని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా తాజాగా ఐసీసీకి లేఖరాశారు. ఐసీసీ క్రికెట్ కమిటీ కూడా సాప్ట్ సిగ్నల్ నిర్ణయంపై ఇటీవల జరిగిన వర్చువల్ మీటింగ్‌లో చర్చించినట్లు తెలుస్తున్నది.

క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే ఇప్పటికే సాఫ్ట్ సిగ్నల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీలోని మెజార్టీ సభ్యులు సాఫ్ట్ సిగ్నల్‌ను తీసేయడానికే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. దీంతో పాటు అంపైర్స్ కాల్ నిర్ణయంపై కూడా చర్చ జరిగింది. ఈ రెండు నిబంధనలకు సంబంధించి కీలక ప్రతిపాదనలు క్రికెట్ కమిటీ ఐసీసీ సీఈసీకి పంపారు. అంపైర్స్ కాల్‌పై ఉన్న అనుమానాలను అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు, క్రికెటర్లకు పూర్తిగా నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఐసీసీ భావిస్తున్నది. సీఈసీ ఈ ప్రతిపాదనలు పరిశీలించి బోర్డు అనుమతికోసం పంపించినట్లు సమాచారం.

డబ్ల్యూటీసీకి న్యూట్రల్ అంపైర్లు..

ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లో జరుగనున్నది. ఇండియా, న్యూజీలాండ్ జట్లు తలపడనున్న ఈ టెస్టు మ్యాచ్‌కు న్యూట్రల్ అంపైర్లను ఐసీసీ నియమించింది. ఆ టెస్టు మ్యాచ్ ఐసీసీ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్‌లో జరుగనున్నది. ఫైనల్ మ్యాచ్‌కు క్రిస్ బ్రాడ్ రిపరీగా, రిచర్డ్ కెటల్‌బరో, మైఖైల్ గాఫ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు అంపైర్లుగా వ్యవహరించనున్నారు. ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లోని 12 మందిలో ఈ ముగ్గురు ఇంగ్లాండ్ అంపైర్లు ఉండటంతో వారిని ఎంపిక చేసింది.

Next Story

Most Viewed