సామాజిక దూరానికి ఉందో యాప్ .. ‘నో క్యూ నౌ’

by  |
సామాజిక దూరానికి ఉందో యాప్ .. ‘నో క్యూ  నౌ’
X

దిశ వెబ్ డెస్క్ :

కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నిత్యావసర సరుకుల కొనుగోలుకు మాత్రం కొంత వెసులుబాటు కల్పించింది. పరిమిత సమయంలో వాటిని తీసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించింది. దీంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. ఫలితంగా సామాజిక దూరం నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో, దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు హైదరాబాద్‌కు చెందిన టెకీ విజయానందరెడ్డి.

వైరస్ ను కట్టడి చేసేందుకు… సామాజిక దూరం పాటించాలని దేశ ప్రధాని సహ, డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సూచిస్తూనే ఉన్నారు. అయినా ప్రజలు ఆ మాటలను పెడ చెవిన పెడుతున్నారు. సామాజిక బాధ్యత మరిచి .. కూరగాయాల మార్కెట్, చికెన్ షాపులు, సూపర్ మార్కెట్ల వద్ద గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారు. ఆ చిన్నపాటి నిర్లక్ష్యమే మన కొంప ముంచుతుంది. ఒక్కరు చేసిన తప్పు వల్ల .. దేశ ప్రజలంతా ప్రమాదంతో పడే అవకాశం ఉంది. అందుకే.. ఈ సమస్యకు చెక్ చెబుతూ… హైదరాబాద్ కు చెందిన టెకీ విజయానందరెడ్డి.. ‘నో క్యూ నౌ’ ((http://noqnow.com))అనే వెబ్‌ ఆధారిత అప్లికేషన్‌ను రూపొందించారు. దీని ద్వారా స్థానికంగా ఉండే నిత్యావసరాల దుకాణాలో కొనుగోలుకు స్లాట్‌లు బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. సూపర్ మార్కెట్లు, ఇతర నిత్యావసర దుకాణాల్లో ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవడం ద్వారా ఆ సమయంలో వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. నాలుగు రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఇప్పటికే పలువురు వినియోగిస్తూ సామాజిక దూరం పాటిస్తున్నారు.

ఎలా బుక్ చేసుకోవాలి?

నో క్యూ నౌ యాప్‌లో మనం ఉంటున్న ప్రదేశం పేరును ఎంటర్ చేయగానే మన చుట్టూ ఉన్న సూపర్ మార్కెట్లు, బజార్లు, కూరగాయల దుకాణాలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఆ జాబితాలో మనం తరుచుగా వెళ్లే స్టోర్‌ను కానీ, ఏ ఇతర దుకాణాన్ని కానీ ఎంచుకుని టైమ్ స్లాట్‌ను ఎంచుకోవాలి. ఒక్క నిముషంలోనే మన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే యూనిక్ పాస్‌వర్డ్, క్యూఆర్ కోడ్ పంపుతారు. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న స్టోర్‌కు వెళ్లి ఆ క్యూఆర్ కోడ్‌ను చూపించి షాపింగ్ చేసుకోవచ్చు. మొబైల్ లేదంటే కంప్యూటర్ ద్వారా స్లాట్‌లు బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, బెంగళూరు, పూణెలలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ను పలు సొసైటీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో వినియోగిస్తున్నారు.

Tags: coronavirus, lockdown, social distance, noqnow, super markets, online slot

Next Story

Most Viewed