హుజురాబాద్‌లో మరో విచిత్రం.. సర్వే బృందాలనే సర్వే చేసిన ఓటర్లు..

by  |
హుజురాబాద్‌లో మరో విచిత్రం.. సర్వే బృందాలనే సర్వే చేసిన ఓటర్లు..
X

దిశప్రతినిధి, కరీంనగర్ :

ఏం తాతా ఎట్లున్నయ్యే ఎలక్షన్స్ ?
మంచిగున్నయ్ బిడ్డ..
నువ్వు ఎటేస్తవే ఓటు?
ఇంతకు నువ్వెవరు చెప్పు..?
కాదు తాతా ఊర్కనే అడుగుతున్ననే..
నువ్వు మా ఊరి పొల్లగానివి కాదు కదరా నీకెందుకు చెప్పాలే?
అరె అట్లగాదే తాతా నేను హుజురాబాద్‌లో ఎవరు గెలుస్తరో తెలుసుకోవడానికి సర్వే చేసేందుకు వచ్చిన..
అవునా నువ్వు ఏ పార్టీ తరుపున వచ్చినవ్ బిడ్డా..?

అంతే.. సర్వే కోసం వచ్చిన టీం సభ్యుడు షాక్‌కు గురయ్యాడు. అరే ఎటు ఓటేస్తవో చెప్పు తాతా అని అడిగితే నువ్వేందే ఏ పార్టోవోనివని అడుగుతున్నవ్ అంటూ ముఖం తుడుచుకున్నాడు సర్వే టీం సభ్యుడు. అట్ల కాదు బిడ్డ నువ్వేం ఫికర్ చేయకు, నువ్వు ఏ పార్టీ తరుపున వస్తే అటే నా ఓటు వేస్తాను. నాకేమన్న తెలుసా బిడ్డా.. కేసీఆర్ సారూ అన్ని పథకాలు పెట్టే. ఈటల రాజేందరేమో ఇంటింటికీ వచ్చిపోయే అందుకోసమే నువ్వెవరో తెలిస్తే ఆ పార్టీ వాళ్ల మంచితనం గురించి నీకు చెప్దామనుకున్నానంటూ మరో షాకిచ్చాడు ఆ వృద్దుడు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాశంగా మారిన హుజురాబాద్ బై పోల్స్‌లో ఓటరు నాడి తెలుసుకునేందుకు సర్వే టీమ్స్ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఊర్లన్ని తిరిగినా పర్‌ఫెక్ట్ సమాచారం ఇచ్చేవారు లేకుండా పోయారు. ఏం జరుగుతుందో ఎవరికి అనుకూలంగా ఉందో కూడా అంచనా వేసే పరిస్థితి లేకుండా సర్వే టీంలను జిగ్ జాగ్ చేస్తున్నారు హుజురాబాద్ ఓటర్లు. చైతన్యానికి మారు పేరుగా నిలిచే హుజురాబాద్ ఓటరు తన మనసులోని మాటను మాత్రం బయట పెట్టడం లేదని సర్వే టీమ్స్ ఖంగుతింటున్నాయి. సర్వే టీమ్సే కాదు, వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన వ్యక్తుల నడత, నడవడిక చూసి నువ్వు ఇంటెలిజెన్సా..? స్పెషల్ బ్రాంచా అంటూ ఎదురు ప్రశ్నించిన వారూ లేకపోలేదు. ప్రజల నాడిని పసిగట్టేందుకు వెళ్లిన నిఘా వర్గాలు కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోని పల్లె జనం వేస్తున్న ఎదురు ప్రశ్నలతో షాక్ అవుతున్నారు.ఈటల రాజేందర్ ఎపిసోడ్ వ్యవహారం తరువాత నుంచి అటు ఇంటలీజెన్స్ వర్గాలు, ఇటు సర్వే బృందాలు ఊరూ వాడా కలియతిరుగుతున్నాయి. అయితే ఎక్కువ శాతం మంది ఓటర్ల నుంచి ఎదురు ప్రశ్నలే ఎదురవుతుండడంతో ఏంట్రా బాబు ఇక్కడి ప్రజలు ఇలా ఉన్నారేంటని గొణుక్కుంటున్నారట.

నీకే నా ఓటు..

సర్వే టీమ్స్ అయితే, ఏ పార్టీ నుండి వచ్చిన వారయితే వారికి అనుకూలంగా మాట్లాడుతూ పంపించేస్తున్నారా అన్నచర్చ మొదలైంది ఆయా రాజకీయ పార్టీల్లో. అంతేకాకుండా సర్కారును కూడా డైలమాలో పడేస్తున్నారు చాలా మంది ఓటర్లు. ఇంటలీజెన్స్ వర్గాలు కూడా గ్రామాల్లో పల్స్ తెలుసుకునేందుకు పడుతున్న తంటాలు అన్ని ఇన్ని కావు. వచ్చింది పోలీసులా..? మారు వేషంలో వచ్చిన వారా అన్న ఆరా కూడా తీసిన తరువాతే స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇంటలీజెన్స్ వర్గాలను గమనించినట్టయితే మా ఓటు టీఆర్ఎస్‌కే అని చెప్పేస్తున్నారట. సర్వే టీంలు అయితే వారు అడిగే ప్రశ్నలను బట్టి వాళ్లు టీఆర్ఎస్ పార్టీ కోసం వచ్చారా లేక, బీజేపీ కోసం వచ్చారా, కాంగ్రెస్ గురించి వచ్చారా అన్న విషయాన్ని గమనించి వారికి అనుకూలంగానే చెప్పేస్తున్నారట.

విసిగిపోయారా..? పసిగట్టారా..?

ఐదు నెలలకు పైగా సుదీర్ఘంగా సాగిన హుజురాబాద్ ఉపఎన్నికల తంతు విషయంలో సర్వేలపై సర్వేలు జరుగుతుండడంతో హుజురాబాద్ ప్రజలు విసిగిపోయారా లేక వచ్చిన వారు సర్వే బృందాలా, నిఘా వర్గాల అన్న విషయంలో ఓ అంచనాకు వచ్చేశాయా అన్న చర్చ సాగుతోంది. విప్లవ భావజాలంతో పాటు, ఆధునిక సమాజ పోకడలపై అవగాహన ఉన్న హుజురాబాద్ ఓటర్లు ఎవరిని అక్కున చేర్చుకుంటారు. ఎవరిని విస్మరిస్తున్నారు అన్న విషయంపై సర్వే టీమ్స్ కే అంతుచిక్కకుండా వ్యవహరిస్తున్నారన్నది మాత్రం వాస్తవం.


Next Story

Most Viewed