వందశాతం వ్యాక్సినేషన్ ఉత్తుత్తే..

by  |
వందశాతం వ్యాక్సినేషన్ ఉత్తుత్తే..
X

దిశ, సిటీ బ్యూరో : కరోనా మహమ్మారి నివారణ కోసం ప్రభుత్వం మహానగరంలో నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించేందుకు చేస్తున్న కృషి అంతా ఉత్తుత్తే! వంద వ్యాక్సినేషన్ సెంటర్లు, మరో వంద సంచార వ్యాక్సినేషన్ కేంద్రాలతో హడావుడే తప్పా, క్షేత్ర స్థాయిలో వ్యాక్సినేషన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వేల సంఖ్యలో వ్యాక్సినేషన్ డోసులు, వందల సంఖ్యలో కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పకుంటున్న అధికారులు వ్యాక్సిన్లపై ప్రజల్లో టీకాలపై నెలకొన్న అపోహలను తొలగించటంలో పూర్తిగా విఫలమవుతున్నారు.

బల్దియా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, టార్గెట్లు విధించటంతో క్షేత్ర స్థాయి సిబ్బంది తూతూమంత్రంగా విధులు నిర్వర్తించి ఉన్నతాకారులతో భేష్ అన్పించుకుంటున్నారే తప్పా, దాంతో సాధారణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని జనం విమర్శిస్తున్నారు. మహానగరాన్ని నూటికి నూరు శాతం వ్యాక్సినేటెడ్ సిటీగా తీర్చిదిద్దేందుకు కొద్ది రోజులుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, బల్దియా సమష్టిగా నిర్వహిస్తున్న సంచార వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఆశించిన స్థాయిలో జనం రావటం లేదు. జనాలు ఎందుకు రావటం లేదన్న విషయాన్ని సమీక్షించుకోకుండా పక్కనబెట్టి, ప్రతి రోజు వందల సంఖ్యలో వాహానాలు, సిబ్బందిని వినియోగించామని, వేల డోసుల టీకాలు వేశామని గొప్పగా ప్రకటించుకుంటున్నారు.

ఈ ప్రకటనల కోసం ఎంతో ఖర్చు చేస్తున్న అధికారులు వ్యాక్సిన్లపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు ఎందుకు ప్రయత్నించటం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సినేషన్ సర్వేకు ఇంటింటికెళ్లినపుడు కో వ్యాగ్జిన్, కోవీ షీల్డు వ్యాక్సిన్లలో ఏదేసుకుంటే మేలని మురికివాడలు, బస్తీల్లో నివసించే సాధారణ జనం సందేహాలను వ్యక్తం చేసినపుడు వారికి సరైన విధంగా గైడ్ చేయటంలో బల్దియా సిబ్బంది విఫలమవుతోంది. ఇందుకు వారు నిరక్షరాస్యులై ఉండటమే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి బల్దియాలోని దాదాపు అన్ని విభాగాల్లోని అధికారుందరికీ ఇమ్యునైజేషన్ విధులకు నియమించినా, వారు ఉదయం తమకు కేటాయించిన సర్కిల్ లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో అలా పర్యటించి తమ పనైపోయిందని భావిస్తున్నారు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో సర్కారు, ఉన్నతాధికారులు ఆశించిన స్థాయిలో వ్యాక్సినేషన్ జరగటం లేదు. మరో వైపు మూడో వేవ్ పొంచి ఉండటంతో మున్ముందు ఎలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయం జనంలో మరింత ఎక్కువైంది.

అపోహలనేకం!

కోవ్యాగ్జిన్ వేసుకున్న మరుసటి రోజు జ్వరం వస్తుందని, ఇమ్యునిటీ తక్కువగా ఉన్న పెద్ద వయస్కులకు కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయని, కోవీషీల్డు వేసుకుంటే మంచిగానే ఉన్న వారికి వేసుకున్న మరుసటి రోజు కరోనా వస్తుందని, పధ్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందితే నయమైపోయి, మళ్లీ కరోనా రాదని కొంత మందిలో అపోహాలున్నాయి. ఇలాంటి అపోహాల కారణంగా చాలా వరకు బస్తీలు, మురికివాడల ప్రజల్లోనే ఉన్నాయి.

మరికొందరికిలో మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు టీకా ఎపుడిస్తారు. ఒక వేళ ఇపుడు తాము తీసుకున్న కోవ్యాగ్జినో , కోవీషీల్డో అపుడు అందుబాటులో లేకుంటే ఎలా? అని చాలా మంది అనేక రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లు, వారికేం చెప్పాలో తెలియక అక్కడి నుంచి సమీపంలో ఎక్కడ వ్యాక్సిన్లు వేస్తున్నారో చెప్పి వెళ్లిపోతున్నామని పలువురు బల్దియా సిబ్బంది పేర్కొన్నారు. ఫలితంగా ఇప్పటి వరకు నూటికి నూరు శాతం కాలనీలు వ్యాక్సినేట్ అయ్యాయే తప్పా, బస్తీలు, మురికివాడలు వ్యాక్సినేట్ కాకపోవటం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇష్టారాజ్యంగా స్టిక్కర్లు

కరోనా టీకా డ్రైవ్, సర్వేలో బల్దియా సిబ్బంది ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనీసం సర్వే నిర్వహించకుండా, స్థానికులు టీకాలు వేసుకున్నారా? వేసుకుంటే రెండు డోసులు వేయించుకున్నారా? అన్న వివరాలను సేకరించకుండానే ఇష్టమొచ్చినట్లు ఇళ్లకు స్టిక్కర్లను అంటించి వెళ్లిపోతున్నారు.

వ్యాక్సినేషన్, సర్వేపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించటం వల్ల నిరక్షరాస్యులైన శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బంది వ్యాక్సినేషన్ అంటేనే స్టిక్కర్లు అంటించటమేనన్న చందంగా వ్యవహరిస్తున్నారు. సర్కిల్ 15లోని శంకరమఠం వెనకానున్న కాలనీలో రామయ్య ఐఐటీ ఇన్ స్టిట్యూట్‌కు వెళ్లే దారిలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆరు కుటుంబాల్లో ఏ ఒక్కరితో వ్యాక్సినేషన్ వివరాలను అడగకుండానే వారికి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు స్టిక్కర్లు అంటించటం పట్ల అపార్ట్‌మెంట్ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

విధుల్లో కరవైన పారదర్శకత

వ్యాక్సినేషన్ డ్రైవ్, సర్వేలో బల్దియా, రాష్ట్ర వైద్యారోగ్యా శాఖకు చెందిన సిబ్బంది ప్రతి ఇంటికెళ్లి, అందులో నివాసముంటున్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి వారిలో ఎంతమంది వ్యాక్సిన్ వేసుకున్నారు? ఎన్ని డోసులు వేసుకున్నారన్న సమాచారాన్ని రికార్డు చేసుకోవల్సి ఉంది. ఒక వేళ టీకాలు తీసుకోని వారుంటే వారిని సమీపంలోని వ్యాక్సినేషన్ సెంటర్ కు తీసుకెళ్లి టీకా వేయించి, వారి వివరాలను కూడా రికార్డు చేసుకోవాలని, ఇలా ఒక ఇంట్లో నివాసముంటున్న కుటుంబం మొత్తం వ్యాక్సిన్ చేయించుకుంటే ఆ ఇంటికి వంద శాతం వ్యాక్సినేటెడ్ అనే స్టిక్కర్‌ను అంటించాల్సి ఉంటుంది.

అందులో ఇంటి నెంబర్, సర్కిల్ నెంబర్ తో పాటు ఇంటి యజమానికి సంతకాన్ని తీసుకున్న ఆ తర్వాత ఆ స్టిక్కర్ ను అంటించాల్సి ఉంది. కానీ సర్కిల్ 15లో కేవలం సర్కిల్ నెంబర్ రాసి, కుటుంబ సభ్యుల వ్యాక్సినేషన్ గురించి తెల్సుకోకుండానే, మాట్లాడకుండానే, ఇంటి వారికి తెలియకుండానే స్టిక్కర్లు వేసి వెళ్లిపోతున్నారు సిబ్బంది. ఈ ప్రజల ప్రాణాలను కాపాడే వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ బల్దియా అధికారులు ఈ రకంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటం శోచనీయమని కాలనీ వాసులంటున్నారు.



Next Story

Most Viewed