ఆర్టీసీకి కష్టకాలం.. కరోనాతో కుదేలవుతున్న సంస్థ

by  |
ఆర్టీసీకి కష్టకాలం.. కరోనాతో కుదేలవుతున్న సంస్థ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీకి కష్టకాలం ఎక్కువైంది. గతేడాది నుంచి ఆర్టీసీకి కలిసి రావడం లేదు. కరోనా మొదటి వేవ్​లాక్‌డౌన్​ తర్వాత బస్సులు మొదలై.. మూడు నెలలైనా సరిగా తిరగకుండానే మళ్లీ డిపోలకు పరిమితమయ్యాయి. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు ప్రవేశపెట్టిన కార్గో సేవలు కూడా నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సమయంలో కేవలం 4 గంటలే సడలింపు ఉండటంతో కార్గోను నిలిపివేశారు. అటు బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ కూడా తగ్గిపోయింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్​ సడలింపు ఉన్నా.. ఆ సమయంలో బస్సులు తిరిగుతున్నా ప్రయాణికులు రావడం లేదు. లాక్‌డౌన్‌తో అన్ని వర్గాలు ఇండ్లకే పరిమితం కావడం, కొంతమంది సొంత వాహనాలను ఏర్పాటు చేసుకోవడంతో ఆర్టీసీ ఆదాయం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 10 లక్షలు కూడా రావడం లేదు. ఫలితంగా ఆర్టీసీ పరిస్థితి ఎటు వైపు దారి తీస్తుందోననే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులకు కిరాయి చెల్లించడం లేదు. ఐదు నెలల నుంచి రూ. 100 కోట్లు బాకీ పడింది.

బస్సులు అంతంతే..

రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు బస్సులు ఆగిపోయాయి. జిల్లాల్లో కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల వ్యవధిలోనే బస్సులు తిప్పుతున్నారు. ఒక ప్రాంతానికి వెళ్లేందుకు గంట నుంచి గంటన్నర.. వచ్చేందుకు గంటన్నరగా నిర్ధారించిన రూట్లలోనే బస్సులను పంపుతున్నారు. దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు బస్సులను పంపడం లేదు. కచ్చితంగా మూడు గంటలు రావడానికే సమయం పడుతుందని, తిరిగి వెళ్లడం సాధ్యం కాకపోవడంతో బస్సులను ఆపేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఒక దశలో రూ. 1‌‌0 లక్షలు కూడా జమ కావడం లేదు. ఇక గ్రేటర్​పరిధిలో ఉదయం కొన్ని రూట్లలో బస్సులు నడుపుతున్నారు. కానీ ప్రయాణికులు ఎక్కడం లేదు. ఉదయం 9 నుంచి 10 గంటల ప్రాంతంలోనే బస్సుల్లో జనం ఎక్కువగా ఉంటారు. కానీ ఆ సమయానికి బస్సులు డిపోలకు వెళ్లేందుకు తిరుగుముఖం పడుతున్నాయి. దీంతో బస్సులు ఎక్కే ప్రయాణికులు తగ్గిపోయారు.

కార్గో బ్రేక్..​

మారుమూల గ్రామాలకు సైతం పార్శిల్ స‌ర్వీసులు అందిస్తున్న ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవ‌ల‌పై క‌రోనా ఎఫెక్ట్ ప‌డింది. క‌రోనా సృష్టిస్తున్న విప‌త్కర ప‌రిస్థితుల వ‌ల్ల కార్గో, పార్శిల్ సేవ‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రక‌టించింది. వైర‌స్ వ్యాపిస్తున్న క్రమంలో ప్రయాణికులు బ‌స్సులు ఎక్కడానికి ఆస‌క్తి చూప‌ట్లేదు. దీంతో ఇప్పటికే ప్యాసింజ‌ర్ స‌ర్వీసుల‌ను ఆర్టీసీ చాలా వ‌ర‌కు త‌గ్గించుకున్నది. ప్రస్తుత ప‌రిస్థితుల్లో ప్రజ‌లు అంత‌గా.. పార్శిల్ స‌ర్వీసుల‌ను వినియోగించుకోవ‌ట్లేదు. అందుకు కార‌ణం.. పొరుగు రాష్ట్రాల్లో క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డ‌మేన‌ని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని అధికారులు వెల్లడించారు.

ప‌రిస్థితులు కుదుట‌ప‌డే వ‌ర‌కు కార్గో సేవ‌లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామ‌ని తెలిపారు. ఏపీ, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల‌కు టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవ‌లు అందిస్తుండగా.. కరోనా ఉధృతి నేప‌థ్యంలో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్ అమ‌ల్లో ఉన్నది. అయితే గత నెల వరకు కొంత లాభాల్లో నడిచిన కార్గో సేవలు మొత్తానికి నిలిపివేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి పార్శిల్​ సర్వీసులు ఆపేస్తున్నారు. కార్గో బస్సులు జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి తిరిగి వెళ్లడం సాధ్యం కాకపోవడంతో పార్శిల్స్ తీసుకోవడం లేదు. దీంతో కార్గో ఆదాయం మొత్తానికి ఆగిపోయింది.

మా రూ. 100 కోట్లు ఇస్తారా లేదా..?

మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సుల యజమానులకు బాకీ పడింది. ఐదు నెలల నుంచి వారికి కిరాయి చెల్లించడం లేదు. ఈ నెల వరకు మొత్తం రూ. 100 కోట్లు బకాయి పడింది. ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల బస్సులను హైర్‌కు పెట్టారు. వీరికి ప్రతినెలా అద్దె చెల్లించాల్సి ఉండగా.. ఆర్టీసీ ఐదు నెలల నుంచి దాటవేస్తోంది. ఈ నెల.. వచ్చేనెల అంటూ వారికి సర్ధి చెప్పుతూ వచ్చింది. ప్రస్తుతం బస్సులు నడుపడంలేదని, ఆదాయం లేదని, ఇప్పట్లో చెల్లించడం సాధ్యం కాదంటూ తేల్చింది. దీంతో ఆర్టీసీకి బస్సులు కిరాయి పెట్టిన వాహనదారులు ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ నుంచి కిరాయి డబ్బులు ఇప్పించాలని లేఖలు పంపించారు. మొత్తం 3 వేల బస్సుల యజమానులు 3 వేల లేఖల్లో విజ్ఞప్తి చేస్తూ పంపించారు.

ఉదయం బస్​పాస్​ కౌంటర్లు..

కాగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గ్రేటర్‌లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సిటీబస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వి.వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6.30 నుంచి 9.30 వరకు బస్‌పాస్‌ కౌంటర్లు పనిచేస్తాయన్నారు. లాక్‌డౌన్‌తో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందని, అయినా పలు రద్దీ రూట్లలో బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు.



Next Story

Most Viewed