లిక్కర్ మస్తు కొంటుండ్రు

by  |
లిక్కర్ మస్తు కొంటుండ్రు
X

దిశ, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో మద్యాన్ని వ్యాపారులు తెగ కొంటున్నారు. మద్యం అమ్మకాలలో జిల్లా హైదరాబాద్, రంగారెడ్డిలతో పోటీ పడుతోంది. ప్రస్తుతం ఈ జిల్లా ఆరో స్థానంలో ఉంది. కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడికి విధించిన లాక్ డౌన్ సడలింపులు ఎత్తివేస్తారా..లేదా..ఇంకా పటిష్టంగా కొనసాగిస్తారా.? అనే అనుమానాలతో లాభ, నష్టాలు బేరీజు వేసుకొని వ్యాపారులు పెద్దఎత్తున మద్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ తెలంగాణ బేవరేజేస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం నిల్వలు దుకాణాలకు తరలుతున్నాయి. ఐఎంఎల్(ఇండియన్ మేడ్ లిక్కర్) డిపోల వద్ద పెద్ద ఎత్తున కాంట్రాక్టు వాహనాలు బారులు తీరుతున్నాయి. కొనుగోళ్లు రూ.కోట్లలో జరిగితే స్టాక్ తగ్గడం ఖాయమని అధికారులు అంటున్నారు. మందుబాబులు మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి చల్లటి బీర్లకు చాలా డిమాండ్ ఉంటుందని అనుకుంటే అది పొరపాటే అవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం డిపోల నుంచి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 144 మద్యం దుకాణాలు, 15 బార్లు, 3 క్లబ్‌లలో మార్చి 22 జనతా కర్ఫ్యూ నాటి మద్యం నిల్వలు లాక్ డౌన్ తర్వాత పరిశీలిస్తే తేడా ఉందని అధికారులు అంటున్నారు.

జరిగిన అమ్మకాలు..

లాక్ డౌన్ తర్వాత నిజామాబాద్ ఐఎంఎల్ డిపోల నుంచి మే 6న రూ.2.53 కోట్లు, 7న రూ4.96 కోట్లు, 8న 9.3 కోట్లు, 9న రూ. 7.75 కోట్లు, 10న రూ. 2.25 కోట్లు, 11న రూ. 8.23 కోట్లు, 12న రూ. 8.23 కోట్ల అమ్మకాలు జరిగాయి. మద్యం షాపుల కాడికి మందుబాబులు నిత్యం రావడం లేదు. కొందరు ఒకే సారి వచ్చి రూ.4 నుంచి 5 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నారు. మద్యం పక్కదారి పట్టించిన కొన్ని బార్లకు అబ్కారీ శాఖ అధికారులు రూ.2 నుంచి 3 లక్షల వరకు జరిమానాలు విధించారు. మద్యం షాపులతో పాటు బార్లలోనూ లిక్కర్ వరదలా పారుతోంది. ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులకు తెలియకుండా లైసెన్సెడ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా వచ్చిన మద్యాన్ని ఆ తర్వాత రహస్య ప్రాంతాలకు చేరవేస్తున్నారని సమాచారం. వ్యాపారులు మద్యం మొత్తాన్ని ఒకే దగ్గర డంప్ చేయకుండా ముఖ్యంగా బ్రాండెడ్ మద్యాన్ని వేరే వేరే చోట్ల నిల్వ చేస్తున్నారనే గుస గుసలు మొదలయ్యాయి. అయితే, లాక్ డౌన్ తర్వాత మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed