పాతుకుపోయిన హెచ్ఓడీలు.. గడువు ముగిసినా కుర్చీలను వదలట్లే..

by  |
HOD
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశాఖలోని హెచ్ఓడీలంతా ఏళ్ల తరబడి విధుల్లో కొనసాగుతున్నారు. డీఎంఈ (డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్), హెల్త్ యూనివర్సిటీ వీసీ, నర్సింగ్ రిజిస్ర్టర్, నిమ్స్ డైరెక్టర్లు అనేక సంవత్సరాలుగా ఒకే కుర్చీల్లో తిష్టవేశారు. దీంతో అర్హులైన వారికి అవకాశం రావడం లేదని మెడికల్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అంతేగాక వైద్యవిధాన పరిషత్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వంటి కీలక పోస్టులను కూడా ఇంచార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. నిత్యం బిజీ షెడ్యూల్‌లో ఉండే డీఎంఈ పోస్టుతో పాటు వైద్యవిధాన పరిషత్ ఇంచార్జీ బాధ్యతలు కూడా ఒకరి దగ్గరే ఉండటం వలన రెండు శాఖలను సమన్వయంతో నిర్వహించడం ఆ అధికారికి కూడా సాధ్యం కావడం లేదు. పని ఒత్తిడితో పాటు ఫైళ్లన్నీ పెండింగ్ పడుతున్నట్లు స్వయంగా ఆ శాఖలోని ఉద్యోగులే చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఆయన్నే కొనసాగించడం గమనార్హం. దీంతో రెండు శాఖల్లోని పనులన్నీ సమర్ధవంతంగా జరగడం లేదని మెడికల్ యూనియన్ నాయకులు చెబుతున్నారు.

ప్రతీసారి ఎక్స్‌టెన్షన్‌లు..

ప్రభుత్వ పరిధిలో ఉండే హెచ్ఓడీల పోస్టుల్లో ఒక వ్యక్తి గరిష్ఠంగా 3 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేయకూడదనేది సూత్రపాయంగా ఉండే నిబంధన. కానీ వైద్యశాఖలో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు ఏళ్ల తరబడి అదే కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నిమ్స్ లో డైరెక్టర్ 2015 నుంచి ఆ పోస్టులో కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం 2019లోనే ముగిసింది. కానీ ప్రభుత్వం అప్పట్నుంచి ఆయనకు ఎక్స్ టెన్షన్ ఇచ్చి మరీ ఆ సీట్లో కూర్చోపెట్టడంలో అంతర్యామేమిటో అర్థం కావడం లేదని ఆ హాస్పిటల్ లో పనిచేసే కొందరు సీనియర్లు వాపోతున్నారు.

అదే విధంగా ప్రతీ సంవత్సరం సుమారు రూ.800 కోట్ల వ్యవహరం నడిచే ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ పోస్టును కూడా ఆరేళ్ల నుంచి ఇంచార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం హెల్త్ సెక్రటరీ ఆరోగ్య శ్రీ సీఈఓగా కొనసాగుతున్నారు. ఇక కాళోజీ యూనివర్సిటీ వీసీ కూడా 2015 నుంచి ఆ పోస్టులో కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం కూడా 2019 డిసెంబర్ లోనే ముగిసింది. ఆ తర్వాత ఆయనకు 6 నెలలు ఎక్స్ టెన్షన్ ఇచ్చారు. ఆ సమయం పూర్తయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయనే వీసీగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం. మరోవైపు నర్సింగ్ రిజిస్ర్టర్ కూడా ఆ కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి ఉన్నట్లు సమాచారం. ఇక ఐఏఎస్ కేడర్ వ్యక్తి ఉండాల్సిన టీఎస్ ఎంఎస్ఐడీసీ పోస్టులో గ్రూప్ 1 ఆఫీసర్ ఉండటం విచిత్రంగా ఉన్నది.

గవర్నర్ రిజెక్ట్ చేసినా…

హెుల్త్ యూనివర్సిటీ ఏర్పడిన మొదట్లో (2015) ఓ ఐఏఎస్ ఆఫీసర్ వీసీగా పనిచేశారు. ఆయన కేవలం ఆరునెలల వ్యవధిలో ఆ పోస్టు నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వీసీ మాత్రం ఏకంగా ఏడేళ్ల నుంచి కొనసాగడం ఆశ్చర్యంగా ఉన్నది. వాస్తవానికి రెండేళ్ల చొప్పున ఒక్కో వీసీ రెండు సార్లు బాధ్యతలు చేపట్టవచ్చనేది నిబంధన. కానీ ప్రస్తుత వీసీ పదవీ కాలం పూర్తయినా కూడా అదే పోస్టులో ఉంటున్నారు. గవర్నర్ సైతం ఆయన వీసీకి అనర్హుడని గతంలో చెప్పినప్పటికీ, ఇంచార్జీగా కొనసాగుతున్నట్లు ప్రభుత్వం నివేదించింది. కానీ వీసీగా ఎలాంటి ఎక్స్ టెన్షన్ లు ఇవ్వలేదని మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ చెబుతోంది. అంటే అనధికారికంగానే ఆయన ఆ పోస్టులో కొనసాగుతున్నారని అర్థం.

రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఏం చెబుతోంది..

ఒకశాఖలో మూడు పోస్టులు ఉంటే రెండు ఆంధ్ర, ఒకటి తెలంగాణకు వెళ్లాలనేది రీ ఆర్గనైజేషన్ యాక్ట్ చెబుతోంది. అదే విధంగా రెండు పోస్టులు ఉంటే ఒకటి ఏపీ, మరోకటి తెలంగాణకు, కేవలం ఒకటే పోస్టు ఉంటే అది ఏపీకి ఇచ్చి, తెలంగాణలో కొత్త పోస్టు క్రియేట్ చేసుకోవాలనేది నిబంధన. కానీ హెల్త్ డిపార్ట్ మెంట్ లో రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ను అమలు చేయడం లేదని స్వయంగా ఆ శాఖలోని ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డీఎంఈ పోస్టు కూడా ఏపీకి వెళ్లిందని, కానీ ఇక్కడ ఆ పోస్టు ఇప్పటికీ క్రియేట్ చేయలేదని సమచారం. డీఎంఈ పోస్టులో ఉన్న వ్యక్తి కూడా ఆ బాధ్యతను ఇంచార్జీ కేటగిరీతోనే నడిపిస్తున్నారని ఆరోపణలున్నాయి. గతంలో కోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే నివేదించింది. అంతేగాక సీనీయారిటీ ప్రకారం కూడా డీఎంఈ ఆ పోస్టుకు అర్హుడు కాదని ఆయన కింద పనిచేసే ఉద్యోగులే చెబుతున్నారు.

దళిత ఆఫీసర్లు లేరు…

సీఎం ఆధ్వర్యంలో ఉన్న హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఒక్క దళిత హెచ్ఓడీ కూడా లేరు. పదేపదే దళితులకు న్యాయం చేస్తున్నామని మాట్లాడే సీఎం ఒక్క హెచ్ఓడీని కూడా దళితులను నియమించలేదు. దీంతో ఆ శాఖలో పనిచేసే దళిత ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్నది. దీంతో పది రోజుల్లో ప్రస్తుతం ఉన్న హెచ్ఓడీలను మార్పు చేసే అవకాశం ఉన్నట్లు సెక్రటేరియట్ లోని ఓ సీనియర్ అధికారి ‘దిశ’కు తెలిపారు.

సీనియారిటీ ప్రకారం పోస్టులు ఇవ్వాలి

వైద్యశాఖలో సీనియారిటీ ప్రకారం పోస్టులు ఇవ్వాలి. అర్హులైన వారిని వెంటనే అడిషనల్ డైరెక్టర్లుగా ప్రమోట్ చేయాలి. టీవీవీపీ కమిషనర్ పోస్టును కూడా అదే శాఖలో పనిచేసే ఉద్యోగికి ఇవ్వాలి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 30 ముఖ్యమైన పోస్టులకు సుమారు 50 మంది పోటీలో ఉన్నారు. కానీ వారంతా ప్రస్తుతం ఉన్న అధికారులు ఎప్పుడు కుర్చీలు వదిలిపెడతారని వేచిచూస్తున్నారు.
-డాక్టర్ రమేష్, చైర్మన్, తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ

Next Story

Most Viewed