దేవుడి భూములను కొట్టేస్తున్నారు.. కాపాడండి..!

by  |
దేవుడి భూములను కొట్టేస్తున్నారు.. కాపాడండి..!
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్: రాజ‌ధాని న‌గ‌రానికి అనుకుని వున్న ఇంజాపూర్ గ్రామంలో 16వ శ‌తాబ్దానికి చెందిన పురాత‌న‌‌ శ్రీ బాలాజీ వేంకటేశ్వర ఆల‌యం ఉంది. ఆలయానికి కొన్ని ఎకరాల భూమి ఉంది. ఆలయానికి సంబంధించి సుమారు రూ.20లక్షలు బ్యాంకులో ఉన్నాయి. అయినా స్వామి వారికి దూపదీప నైవేద్యాలు లేవు. పాలకులు పట్టించుకోవడం లేదు. దేవాలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేస్తానని దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించారు. అయినా స్థానిక ఎమ్మెల్యే చొర‌వ తీసుకోక‌పోవ‌డంతో నిధులు మంజూరుకాలేద‌ని తెలుస్తోంది. దీంతో ఆ భూములను కబ్జా చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. ఆల‌య ఆస్తుల‌ను కొల్లగొడుతున్న వైనంపై ‘దిశ’ ప్రతినిధి ప్రత్యేక కథనం.

అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప‌రిధి ఇంజాపూర్‌లో ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వర ఆల‌యంలో చంద్రమౌళీశ్వరస్వామి, ప‌బ్బతి ఆంజ‌నేయ‌స్వామి, కామాక్షి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఆల‌యం పేరు మీద రెవెన్యూ రికార్డుల ప్రకారం 64.29 ఎక‌రాలు, ఎండోమెంట్ రికార్డుల ప్రకారం 74.17 ఎక‌రాల భూమి ఉంది. ఇందులో 45.32 ఎక‌రాలు సుమారు 10మంది రైతులు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఎక‌రానికి ఏడాదికి రూ.3800 దేవాదాయ‌శాఖ‌కు చెల్లిస్తున్నారు. ఆల‌యం పేరుపై ఉప్పల్‌లో ఉన్న 6.38 ఎక‌రాల భూమిని 1995లో ఎక‌రాకు రూ.ల‌క్ష చొప్పున అమ్మేసి బ్యాంకులో డిపాజిట్ చేశారు.

ఆల‌య ఆస్తులు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.వెయ్యి కోట్లపైనే ఉంటుంద‌ని అంచ‌నా. ఈ ఆస్తులు ఎలాగైనా కొట్టేయాల‌ని అక్రమార్కులు, క‌బ్జాదారులు కుట్రప‌న్నారు. కొంద‌రు బ‌డా ప్రజాప్రతినిధుల క‌న్ను ఈ ఆస్తుల‌పై ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఆలయానికి ఈవోను నియ‌మించ‌కుండా, పాల‌క‌మండ‌లిని ఏర్పాటు చేయ‌కుండా కాల‌యాప‌న చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఆల‌యానికి చెందిన 21 గుంట‌ల భూమిలో భారీ షెడ్లు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇంకొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మ‌రో 2.31 ఎక‌రాల భూమిలో అక్రమంగా పార్కింగ్ ఏర్పాటు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు.

ఆదాయం ఎటుపోతోంది?

ఆల‌యానికి ఆదాయం ఉన్నా ఆ సొమ్ము ఎటువెళ్తుందో అర్థం కాని ప‌రిస్థితి. స్వామివారికి క‌నీసం పూల‌దండ‌లు సమర్పించడం లేదని ప్రజలు అంటున్నారు. స్వామివారి క‌ల్యాణం స‌మ‌యంలో లైట్లు, ఇత‌రత్రా ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆల‌యం ప్రస్తుతం శిథిలావ‌స్థకు చేరుకుంది. గ‌తంలో భారీవ‌ర్షాల‌కు పై క‌ప్పు కూలిపోయింది. మ‌రోప‌క్క ఆల‌యానికి వెళ్లే భ‌క్తుల‌కు ఫౌండర్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ నుంచి తీవ్ర వేధింపులు ఎదురవుతున్నట్టు చెబుతున్నారు.

భూముల‌పై కోర్టు కేసులు

ఆల‌య భూముల‌పై స‌ర్వాధికారాలు త‌మవేనంటూ ఆల‌య ఫౌండ‌ర్ ఫ్యామిలీ మెంబ‌ర్లు హైకోర్టులో కేసు వేశారు. ఆ భూముల‌న్నీ ప్రైవేటు వ్యక్తుల‌వ‌ని కోర్టును త‌ప్పుదోవ ప‌ట్టించే ప్రయత్నం చేశారు. 2011లో కోర్టు తీర్పు దేవాదాయ‌శాఖ‌కు అనుకూలంగా వ‌చ్చింది. ‌రెవెన్యూ రికార్డుల్లోనూ ఇనాం భూములుగానే పేర్కొన్నారు. ఆల‌య భూములు క‌బ్జాకు గుర‌య్యాయంటూ ఎంపీ కోమ‌టిరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డిని కొంతమంది క‌లిశారు. ఈ మేర‌కు రెవెన్యూ అధికారులు భూ స‌ర్వే నిర్వహించి క‌బ్జాకు గురైన‌ట్లు తేల్చారు. కాల‌యాప‌న చేసేందుకు మ‌ళ్లీ రీస‌ర్వే అంటూ అధికార పార్టీ నేత‌లు ఒత్తిడి తెస్తున్నార‌ని గ్రామ‌స్తులు విమ‌ర్శిస్తున్నారు.

త‌ర‌చూ దొంగ‌త‌నాలు

ఆల‌యం దొంగ‌త‌నాల‌కు నిల‌యంగా మారింది. గత ఏడాది ఆల‌యంలో పంచ‌లోహ విగ్రహాలు, అంత‌కుముందు ఆల‌య గాలిగోపురం దుండ‌గులు ఎత్తుకెళ్లారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేసిన వ‌నస్థలిపురం పోలీసులు ఇప్పటివరకు దొంగ‌ల‌ను ప‌ట్టుకోలే‌క‌పోయారు. సీసీ కెమెరాలు తొల‌గించి విగ్రహాలను ఎత్తుకెళ్లడం ఇంటి దొంగ‌ల ప‌నేన‌ని స్థానికులు అంటున్నారు. ఆల‌యం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దేవుడికి ఆస్తులకు రక్షణ క‌ల్పించాల‌ని ప్రజలు కోరుతున్నారు.

పూజారికి, స్వీప‌ర్‌కు జీతాలు క‌రువు

20ఏళ్లుగా ఆల‌యంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న పూజారి కిర‌ణ్‌కుమార్‌కు అటు దేవాదాయ శాఖ నుంచి కానీ, ఇటు ఆల‌య ఆదాయం నుంచి జీతభ‌త్యాలు రావడం లేదు. స్వీప‌ర్‌ మ‌ణెమ్మకు ఇటీవ‌లే రూ.1000 నుంచి రూ.1500కు జీతం పెంచారు.

సీఎం కేసీఆర్‌కు, దేవాదాయ అధికారుల‌కు ఫిర్యాదు

ఆల‌యం అభివృద్ధి చేయాలని కోరుతూ ఇంజాపూర్ గ్రామ‌స్తులు సీఎం కేసీఆర్‌కు, దేవాదాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దేవాల‌యం ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నందున అభివృద్ధికి నిధులు కేటాయించి, స్వామివారికి నిత్య దూప‌దీప నైవేద్యానికి చర్యలు తీసుకోవాల‌ని కోరారు. ఆల‌య ప‌రిరక్షణ కోసం త‌క్షణమే పాల‌క‌మండ‌లి వేయాల‌ని విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed