Historical Places In Afghanistan: ఆఫ్ఘాన్ నేలపై.. చారిత్రక ప్రదేశాలు

by  |
Historical Places In Afghanistan: ఆఫ్ఘాన్ నేలపై.. చారిత్రక ప్రదేశాలు
X

దిశ, ఫీచర్స్ : ‘ఆఫ్ఘాన్’లో అనేక సంస్కృతులు విలసిల్లగా.. ఎన్నో అద్భుతమైన చారిత్రక, స్మారక కట్టడాలు జీవం పోసుకున్నాయి. ఆ దేశంలోని నిర్మాణాలు గిరిజన, సంచార జాతుల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కానీ ఆ భూభాగం అనునిత్యం యుద్ధాలతో తల్లడిల్లింది. అలెగ్జాండర్ నుంచి అమెరికన్ల వరకు ఎంతోమంది రాజులు, రాజ్యాలు అలజడులు సృష్టిస్తూ, ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ క్రమంలోనే బౌద్ధమతం వర్ధిల్లిన ఈ నేలపై బమియాన్‌లోని ఎన్నో చారిత్రక బుద్ధ విగ్రహాలు తాలిబన్ల చేతుల్లో ధ్వంసం కాగా.. మరెన్నో పురాతన కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలి పారిపోవడంతో పీఠమెక్కిన అబ్దుల్ ఘనీ.. ఇప్పటికే ఆఫ్ఘానిస్థాన్ పేరును ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘానిస్తాన్’‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మనకు తెలిసిన చరిత్ర మసకబారి భవిష్యత్తులో మరోచరిత్ర పురుడుపోసుకోవచ్చు. ఈ క్రమంలో కొత్త అధ్యాయాన్ని రచించే దిశగా… విగ్రహారాధనను వ్యతిరేకించే తాలిబన్లు చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హరప్పన్ యుగం ప్రత్యేకతలు, బౌద్ధ అవశేషాలు, ఆఫ్ఘాన్, మొఘల్ కాలంనాటి హిస్టారికల్ మాన్యుమెంట్స్, బ్రిటిష్ పాలనలో ఏర్పడిన కంటోన్మెంట్ ప్రాంతాలు, అమరవీరుల స్మారక చిహ్నాలు ఆప్ఘాన్ చరిత్రకు సాక్ష్యాలు కాగా … తాలిబన్లు వాటి రూపురేఖలు లేకుండా చేయొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.

బాబర్ గార్డెన్స్..

ఇది కాబూల్‌లో ఉన్న బాబర్ చివరి విశ్రాంతి స్థలం. క్రీ.శ 1528లో 11.5 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఉద్యానవనం ఆఫ్ఘానిస్థాన్‌లోని అత్యుత్తమ ప్రదేశాల్లో ఒకటి. బాబర్‌కు తోటలంటే చాలా అభిమానం. మొఘలుల రాజధాని కాబూల్‌లో కనీసం 10 తోటలను వ్యక్తిగతంగా డిజైన్ చేయించగా.. దానిమ్మ, చెర్రీ, ద్రాక్ష తోటలతో పాటు అనేక పూలు, పండ్ల మొక్కలకు నిలయంగా చెప్పుకోబడుతుంది. ఇదే గార్డెన్‌లో ఉన్న మసీద్.. ఆనాటి నిర్మాణ కౌశలానికి సాక్ష్యంగా నిలుస్తుండగా.. రుతువులకు అనుగుణంగా రంగులు పులుముకుని పర్యాటకులను ఆకర్షించడం దీని ప్రత్యేకత.

బుద్ధాస్ ఆఫ్ బమియాన్

బమియాన్ అనేక బౌద్ధారామాలు వెలసిన ప్రదేశం. ఇక్కడ ఆధ్యాత్మికత, తాత్వికత, కళలు విలసిల్లగా.. బమియాన్ కొండల్లో తొలిచిన గుహల్లో బౌద్ధ సన్యాసులు నివసించేవారు. ఆరో శతాబ్దానికి చెందిన అతిపెద్ద బుద్ధ విగ్రహాలను ఈ లోయ సమీపంలోని హజరాజత్ ప్రాంతంలోని ఇసుకరాతి కొండల్లో గాంధార శిల్పకళ పద్ధతిలో చెక్కారు. కుషాణుల కాలానికి చెందిన ఈ శిల్పాలు కాలక్రమేణా వాతావరణ మార్పులకు లోనై పాడవగా.. బమియాన్‌లోని రెండు పెద్ద విగ్రహాలను 2011లో తాలిబన్లు ధ్వంసం చేశారు. కాగా 2015 జూన్ 7న చైనాకు చెందిన దంపతులు ధ్వంసమైన విగ్రహాల ప్రదేశాల్లో 3D లైట్ ప్రొజెక్షన్ టెక్నాలజీతో ఫుల్‌ఫిల్ చేశారు. ఇందుకోసం లక్ష 20 వేల డాలర్లు విరాళమిచ్చారు. విగ్రహాలకు జ్ఞాపికగా ఆ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆఫ్ఘాన్ ప్రభుత్వంతోపాటు యునెస్కో అనుమతి తీసుకోవాల్సి వచ్చింది.

దారుల్ అమన్ ప్యాలెస్

ఒకప్పుడు ఆఫ్ఘాన్ భవిష్యత్తుకు చిహ్నంగా నిలిచిన అందమైన రాజభవనం దారుల్ అమన్ ప్యాలెస్ 2012 యుద్ధంలో ధ్వంసమైంది. 1920లో అమానుల్లా ఖాన్ హయాంలో నిర్మితమైన ఈ కట్టడంలో మొత్తం 150 గదులున్నాయి. నియోక్లాసికల్ శైలిలో రూపుదిద్దుకున్న ఈ ప్యాలెస్ తప్పక చూడాల్సిన ప్రదేశంగా చెప్పవచ్చు. కాగా అమన్ ప్యాలెస్‌ను ప్రభుత్వ అతిథిగృహం, క్యాబినెట్ సమావేశ స్థలంగా వినియోగించారు. సెంట్రల్ హీటింగ్ ఉన్న మొదటి భవనం కూడా ఇదే కావడం విశేషం. కాగా తాలిబన్లు 1996లో అఫ్ఘానిస్తాన్‌ను ఆక్రమించే క్రమంలో నాటి పార్లమెంట్ భవనం దార్ ఉల్ అమన్‌ను బాంబులతో పేల్చేశారు. దీంతో ఈ భవనం రినోవేషన్ కోసం భారత్ 90 మిలియన్ డాలర్లు ఖర్చుచేసింది.

హెరాత్ సిటాడెల్

సిటాడెల్ ఆఫ్ హెరాత్‌నే ‘అలెగ్జాండర్ సిటాడెల్’ అని కూడా పిలుస్తారు. స్థానికంగా ఖాలా ఇక్త్యరుద్దీన్ అని వ్యవహరిస్తారు. ఈ భవనం క్రీస్తుపూర్వం 330 నాటిది కాగా గత 2వేల ఏళ్లలో అనేక సామ్రాజ్యాలు దీనిని ప్రధాన కార్యాలయంగా ఉపయోగించాయి. అయితే దశాబ్ద కాలంగా సంభవించిన యుద్ధాలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ కోట శిథిలావస్థకు చేరగా.. పూర్తిగా పున:నిర్మించాలని అంతర్జాతీయ సంస్థలు నిర్ణయించాయి. దీంతో 2006 – 2011 మధ్య వందలాది ఆఫ్ఘాన్ హస్తకళాకారుల సహకారంతో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. ఇందుకోసం అగాఖాన్ ట్రస్ట్‌తో పాటు అమెరికా, జర్మన్ ప్రభుత్వాలు సుమారు $ 2.4 మిలియన్లు ఖర్చు చేశాయి. పశ్చిమ ముఖంగా ఉన్న ద్వారం చుట్టూ పదమూడు అర్ధ వృత్తాకార టవర్‌లతో రక్షించబడుతున్న ఈ కోటలో ఎథ్నోగ్రాఫిక్, మిలటరీ, పురావస్తు మ్యూజియంలతో పాటు హస్తకళా వర్క్‌షాప్‌లు ఉన్నాయి.

మినార్ ఆఫ్ జామ్

ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఘోర్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ కట్టడాన్ని పూర్తిగా కాల్చిన ఇటుకలతో నిర్మించారు. అందమైన కళాకృతులు, జ్యామితీయ నమూనాలు, ఖురాన్‌లోని శ్లోకాలు చెక్కబడిన ఈ కట్టడం సందర్శకులను ఆకట్టుకుంటుంది. కాందాహార్‌లోని ‘మాస్క్ ఆఫ్ సేక్రెడ్ క్లాక్’‌‌తో పాటు పలు పుణ్యక్షేత్రాలు, శాసనాలు, మజర్ ఈ షరీఫ్, హెరాత్, జలాలాబాద్, సమంగన్, బాల్ట్‌లోని ప్రదేశాలన్నీ చూడదగినవే.

Next Story

Most Viewed