గడ్డి అన్నారం మార్కెట్‌ను ఇప్పుడే తరలించొద్దు : హైకోర్టు

by  |
high court copy
X

దిశ, డైనమిక్ బ్యూరో : గడ్డి అన్నారం మార్కెట్‌ను ఇప్పుడే తరలించొద్దని, ఈనెల 4 వరకూ ఈ ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హోల్ సేల్ ఫ్రూట్ ఏజెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన అప్పీలుపై శుక్రవారం జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

బాటసింగారం తాత్కాలిక మార్కెట్‌లో కనీస సదుపాయాలు లేవని, కోహెడ‌లో పూర్తిస్థాయి మార్కెట్ పూర్తవకముందే హడావిడిగా తాత్కాలిక మార్కెట్‌కు మారుస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది గంగయ్య నాయుడు వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు బాటసింగారం మార్కెట్‌లో సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని, అన్నారం మార్కెట్‌ను ఈనెల 4 వరకు తరలించవద్దని హైకోర్టు ఆదేశించింది. బాట సింగారం మార్కెట్‌లో తగిన వసతులు ఉన్నాయని, అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దాన్ని అడ్డుకోవద్దని అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. పరిశీలించిన న్యాయస్థానం మార్కెట్ తరలింపును ఈనెల 4 వరకు వాయిదా వేసింది. అంతేకాకుండా .. బాట సింగారంలోని పరిస్థితులు, సదుపాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది.

Next Story

Most Viewed