వచ్చే ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్న హీరో మోటోకార్ప్

by  |
వచ్చే ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్న హీరో మోటోకార్ప్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టూ-వీలర్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదిలో కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు హీరో మోటోకార్ప్ సీఎఫ్ఓ నిరంజన్ గుప్తా చెప్పారు. కంపెనీకి చెందిన సొంత టెక్నాలజీని ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావడానికి కంపెనీకి చెందిన ఆర్ అండ్ డీ విభాగంలోని పరిశోధనా సేవలను వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా బ్యాటరీ స్వాపింగ్(అంటే, బ్యాటరీని ఇచ్చి ఛార్జింగ్ చేసిన బ్యాటరీ తీసుకోవడం) విధానం ద్వారా తైవాన్‌కు చెందిన గొగొర్ కంపెనీలో భాగస్వామ్యం చేసుకున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

హీరో బ్రాండ్ పేరున కొత్త వాహనాలను తెచ్చేందుకు ఇరు కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది. 2022 ఏడాది, మార్చి నాటికి కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొస్తామని నిరంజన్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. గొగొర్ కంపెనీ సహకారంతో సొంత వాహనాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం కరోనా మహామ్మారి ప్రభావం కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడంపై అంతగా లేదని, రాబోయే ఐదేళ్ల కాలంలో కంపెనీ ప్రణాళికను అనుసరించి కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తామని నిరంజన్ గుప్తా వెల్లడించారు. కాగా, హీరో మోటోకార్ప్ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో పట్టు సాధించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్ కంపెనీ ఆథర్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed