దంచికొట్టిన వాన.. జలసంద్రమైన వరంగల్.. రాకపోకలు బంద్

by  |
దంచికొట్టిన వాన.. జలసంద్రమైన వరంగల్.. రాకపోకలు బంద్
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఉప‌రిత‌ల ఆవ‌ర్తనం ప్రభావంతో సోమ‌వారం ఉద‌యం నుంచి కురుస్తున్న వ‌ర్షాల‌తో ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా జ‌ల సంద్రమైంది. అనేక చెరువులు మ‌త్తళ్లు దుంకుతున్నాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ఐన‌వోలు మండ‌ల‌ కేంద్రంలోని ఓ చెరువుకు గండి పడింది. దీంతో పంట‌ల‌న్నీ నాశ‌న‌మ‌య్యాయి.

చాలా చోట్ల ప‌త్తి, మిర‌ప‌, వ‌రి పంట‌లు నీట మున‌గ‌డంతో రైతులు ఆవేద‌న చెందుతున్నారు. రామ‌ప్ప, ల‌క్నవ‌రం, పాకాల‌, వ‌డ్డెప‌ల్లి చెరువుతో పాటు అన్ని ప్రధాన జ‌లాశయాలు నిండుకుండ‌లా మారాయి. మేడారంలోని జంప‌న్నవాగు ఉధృతంగా ప్రవ‌హిస్తోంది. ములుగు జాతీయ ర‌హ‌దారిపై ఉన్న క‌టాక్షపురం చెరువు మ‌త్తడి ప‌డుతుంటంతో రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయి.

లక్నవ‌రంలో కాటేజీల్లోకి వ‌ర‌ద నీరు చేరింది. ఇక వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌, కాజీపేట‌, న‌ర్సంపేట‌, మ‌హ‌బూబాబాద్‌, ప‌ర‌కాల‌, జ‌న‌గామ ప‌ట్టణాల్లోని లోత‌ట్టు ప్రాంతాలు వ‌ర‌ద నీటిలోనే తేలియాడుతున్నాయి. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ సిబ్బంది స‌హాయ‌క కార్యక్రమాలు చేప‌డుతున్నారు. వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌లోని ప్రధాన రోడ్లపై వ‌ర‌ద‌నీరు నిలిచి ఉండ‌టంతో రాక‌పోక‌లకు తీవ్ర ఆటంక‌ం ఏర్పడింది.

వ‌ర‌ద‌నీరు దుకాణ స‌ముదాయ‌ల్లోకి చేర‌డంతో చాలాచోట్ల షాపులు మూత‌ప‌డి ఉన్నాయి. వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండలోని చాలా ప్రాంతాల్లో జ‌న‌జీవ‌నం స్తంభించింది. గ్రేట‌ర్ ప‌రిధిలోని దాదాపు 26 ప్రధాన నాలాలు ఉప్పొంగి ప్రవ‌హిస్తున్నాయి. మ‌రో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ఉన్నాయ‌నే వార్త ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప్రాంత ప్రజ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది.




Next Story