శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో..

by  |
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో..
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. దాంతో జూరాల డ్యామ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నిండుకోవడంతో కొంత నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో 3,58,980 క్యూసెక్కులుగా ఉంది.

తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోని ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువన నాగార్జున సాగర్‌కు 40,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 876.80 అడుగులకు చేరింది.

అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 172.2620 టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం ద్వారా ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed