‘కేఫ్ లా గ్రావిటియా’.. అందరూ హియరింగ్ ఇంపెయిర్డ్ ఉద్యోగులే

by  |
‘కేఫ్ లా గ్రావిటియా’.. అందరూ హియరింగ్ ఇంపెయిర్డ్ ఉద్యోగులే
X

దిశ, ఫీచర్స్ : జనాభాలో సగటున ప్రతి ఆరుగురిలో ఒకరికి వినికిడి లోపం కొంతమేరకు ఉందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ధ్వని కాలుష్యం, గాయాలు, వ్యాధులు, వారసత్వం హియరింగ్ లాస్ రావడానికి ప్రధాన కారణాలు కాగా వృద్ధాప్యం పెరిగేకొద్దీ వినికిడి శక్తి లోపిస్తుందన్నది నిజమే. అయితే వినికిడి లోపంతో బాధపడే వారికి ఉద్యోగావకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో వారికి అండదండగా ఉండటానికి స్టీల్ సిటీగా పేరుగాంచిన జంషెడ్‌పూర్‌లోని ‘కేఫ్ లా గ్రావిటియా’ ముందుకు వచ్చింది. అందులోని ఉద్యోగులంతా కూడా హియరింగ్ ఇంపెయిర్డ్ బాధితులు కావడం విశేషం.

కేఫ్ లా గ్రావిటియా వినికిడి లోపం ఉన్న యువతకు ఉపాధి అందిస్తుండగా.. ప్రస్తుతం 10మంది వర్క్ చేస్తున్నారు. దీన్ని ఆశిష్ దుగ్గర్ 2016లో ప్రారంభించాడు. సమాజం కోసం తనవంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్‌లో ఉన్నతమైన ఉద్యోగం మానేశాడు ఆశిష్. జీవనం కోసం తొలిగా ఓ టీ స్టాల్ ప్రారంభించగా ఒక రోజు ఓ వ్యక్తి తన సోదరితో కలిసి టీ స్టాల్‌కు వచ్చారు. ఆమెకున్న వినికిడి లోపం కారణంగా ఉద్యోగం రాలేదని చెప్పుకుని బాధపడ్డాడు. ఆ సంఘటనే ఆశిష్ ఆలోచన మార్చింది. వినికిడి లోపమున్న ఉద్యోగులతో కేఫ్‌ను తెరవాలని నిర్ణయించుకుని ‘కేఫ్ లా గ్రావిటియా’తో ముందుకు వచ్చాడు. అక్కడ అందరూ సైన్ లాంగ్వేజ్‌లోనే మాట్లాడతారు. అయితే వీరి సేవలు కేఫ్‌కే పరిమితం కాలేదు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో జంషెడ్‌పూర్‌లోని ప్రజలకు సైన్ లాంగ్వేజ్‌లో టీకా వేసుకోమని ప్రేరేపించారు. అందులో ఉన్న దుగ్గర్ ‘నో హాంకింగ్’ ప్రచారం నిర్వహిస్తున్నాడు. అంతేకాదు 2017 నుండి ‘ఖమోషెవిత్‌లై‌ఫ్’ అనే కాంటెస్ట్ రన్ చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెఫ్ పీపుల్ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. తమ నైపుణ్యాన్ని చూపించడానికి ఇదో వేదిక. విజేతలకు 400 డాలర్ల నగదు బహుమతి అందిస్తున్నాడు.

‘కేఫ్ స్టార్ట్ చేసిన కొత్తలో నా ఉద్యోగులు ఏం చెబుతున్నారో నాకు అర్థం అయ్యేది కాదు. కానీ ఆరు నెలల్లోనే సంకేత భాష నేర్చుకున్నాను. ఇప్పుడు నేను వారిని కమ్యూనికేట్ చేయగలను. బహుశా భారతదేశంలో ఇటువంటి కేఫ్ ఇక్కడ మాత్రమే ఉందనుకుంటున్నాను. కరోనా నేపథ్యంలో కేఫ్‌లోనే అందరికీ టీకాలు వేయించాను’ అని ఆశిష్ తెలిపాడు.

అతని చొరవకు ప్రజల నుండి మంచి స్పందన రావడంతో నగరంలోని ప్రముఖులు అక్కడికి వస్తుంటారు. ‘శారీరకంగా సరిగా ఉన్నవారే పనిని సమర్థవంతంగా చేయగలరనే అపోహను కేఫ్ లా గ్రావిటియా యజమాన్యం దాన్ని బ్రేక్ చేసింది. ఇది వ్యాపారంలో మరెవరూ ఆలోచించని కొత్త కోణాన్ని చూపించింది. అందరికీ ఇదో మేలుకొలుపు’ అని జంషెడ్‌పుర్ కమీషనర్ సూరజ్ అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed