ఈ ఏడాది హెల్త్‌కేర్, టెక్నాలజీ, తయారీ రంగాల్లోనే మెరుగైన వేతన పెంపు

by  |
ఈ ఏడాది హెల్త్‌కేర్, టెక్నాలజీ, తయారీ రంగాల్లోనే మెరుగైన వేతన పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సంక్షోభ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా నియామకాలు ప్రభావితం అవుతున్నప్పటికీ ఆరోగ్య సంరక్షణ(హెల్త్‌కేర్), తయారీ, టెక్నాలజీ రంగాలు ఈ ఏడాది కీలక నియామక రంగాలుగా కొనసాగనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈ రంగాల్లో వేతనాల పెంపు 6-8 శాతం మధ్య ఉంటుందని అంచనా. గతేడాది సైతం ఇవే రంగాలు నియామకాల విషయంలో ముందంజలో ఉన్నాయని ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థ ఆర్‌జీఎఫ్ ప్రొఫెషనల్ రిక్రూట్‌మెంట్ వెల్లడించింది. ‘ఆర్‌జీఎఫ్ ఇంటర్నేషనల్ రిక్రూట్‌మెంట్ శాలరీ వాచ్-2021; ఇండియా’ పేరుతో ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ప్రధానంగా హెల్త్‌కేర్ రంగంలో ఔషధ ఉత్పత్తికి డిమాండ్ పెరగడంతో అనుభవం, నైపుణ్యం కలిగిన వారికి సంస్థలు ప్రాధాన్యత కల్పిస్తాయని నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా సేల్స్ అండ్ మార్కెటింగ్, ఔషధ తయారీ, ఉత్పత్తి, కార్యకలాపాలు, మెడికల్ ఏరియా, ఆర్అండ్‌డీ విభాగాల్లో నైపుణ్యం కలిగిన వారికి 7-8 శాతం ఇంక్రిమెంట్ సంస్థలు ఇస్తాయని నివేదిక తెలిపింది.

అలాగే, కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ వినియోగం పెరగడంతో టెక్నాలజీ రంగంలోనూ ఇదే ధోరణి ఉంది. టెక్నాలజీ అవసరం నేపథ్యంలో చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు ఈ రంగంలో నియామకాలతో పాటు వేతనాల పెంపును ఇస్తాయని నివేదికలో తేలింది. ఈ రంగంలో వేతనాల పెంపు 40 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ఇక, తయారీ రంగంలో కొత్త టెక్నాలజీతో ఎక్కువ సామర్థ్యాన్ని సాధించేందుకు పరిశ్రమల్లో డిమాండ్ ఉంది. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సరఫరా నిర్వహణ డిమాండ్ అధికంగా ఉంది. ఈ రంగాల్లో వేతన పెరుగుదల ఈ ఏడాది 7 శాతం ఉంటుందని నివేదిక అంచనా వేసింది.



Next Story

Most Viewed