కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో రేషన్ పంపిణీపై కీలక ప్రకటన.!

by  |
కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో రేషన్ పంపిణీపై కీలక ప్రకటన.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో రేషన్ డీలర్లు సరకులు పంపిణీ చేసేందుకు భయపడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు ఆరోగ్య రక్షణ కల్పిస్తేనే సరకులను పంపిణీ చేస్తామని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు అన్నారు. గురువారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.

రాష్ట్రంలో కరోనా కారణంగా 45 మంది డీలర్లు మృతి చెందారని, మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ప్రభుత్వం రేషన్​డీలర్లకు ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కరోనా మహమ్మారితో మరింత మంది రేషన్ డీలర్లు ప్రాణాలు పోయే అవకాశముందన్నారు. చనిపోయిన డీలర్లను సర్కార్ అసలు పట్టించుకోవడం లేదన్నారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో రేషన్​డీలర్లు కరోనాతో చనిపోతే రూ. 25 లక్షలు ఎక్స్​గ్రేషియా ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూడా కోవిడ్​బారిన పడి మృతి చెందిన డీలర్లకు రూ. 25 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్​చేశారు.

ప్రభుత్వం నుంచి రేషన్ డీలర్లకు రూ.57 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, సివిల్ సప్లైయి కార్పొరేషన్‌లో డబ్బులు ఉన్నా.. వారు నిధులను విడుదల చేయడం లేదన్నారు. గన్ని బ్యాగ్స్ ధర విషయంలో రేషన్​డీలర్లకు అన్యాయమే జరుగుతోందని, బహిరంగ మార్కెట్లో గన్ని బ్యాగు ధర రూ. 35 ఉంటే డీలర్లకు మాత్రం సర్కార్​రూ.18 మాత్రమే చెల్లిస్తుందన్నారు. పేద ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండి లబ్ధిదారులకు నిత్యావసర సరకులను డీలర్లు పంపిణీ చేస్తున్నారని, అలాంటి వారికి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మాస్కులు, సానిటైజర్స్‌ను సర్కార్​వెంటనే అందజేయాల్సిన అవసరముందన్నారు. వీటితో పాటు డీలర్లకు ఆరోగ్య భరోసానిచ్చేందుకు ఇన్సూరెన్స్​ సౌకర్యం కల్పించాలన్నారు.

Next Story

Most Viewed