కరోనా సెకండ్ వేవ్: 'దిశ'తో అసలు విషయం చెప్పిన హెల్త్ డైరెక్టర్

by  |
కరోనా సెకండ్ వేవ్: దిశతో అసలు విషయం చెప్పిన హెల్త్ డైరెక్టర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అనేక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా కట్టడి చాలా మెరుగ్గా ఉందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. దేశమంతటా గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్నట్లుగానే మన దగ్గర కూడా కేసుల సంఖ్య ఎక్కువవుతోందని వ్యాఖ్యానించారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల పరిస్థితికి అనుగుణంగా మనం సరిహద్దు జిల్లాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితి గురించి ఆయన ‘దిశ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

విద్యార్థులకు వైరస్ సోకుతున్నందున ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

విద్యా సంస్థలు భౌతిక తరగతులను ప్రారంభించిన తర్వాత పిల్లలకు, టీచర్లకు వైరస్ అంటుకుంది. అందుకే ప్రతీ స్కూల్‌కు టెస్టింగ్ కిట్లను పంపాం. విద్యార్థులకు, టీచర్లకు టెస్టులు చేస్తున్నాం. వైరస్ వ్యాప్తి చెందకుండా చాలా చర్యలు చేపట్టాం.

వ్యాప్తి నివారణకు ఏం చేస్తున్నారు?

స్కూళ్లలో పాజిటివ్ కేసులు బైటపడుతున్నందువల్ల పిల్లలు వారితో పాటు వైరస్‌ను ఇండ్లకు మోసుకెళ్తున్నారు. పాజిటివ్ కేసుల్లో దాదాపు 90 శాతం మంది ఎలాంటి లక్షణాలు లేనివారే. పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ కాబట్టి వారికి వైరస్ సోకినా లక్షణాలేవీ బైటకు రావు. పాసివ్ క్యారియర్లుగా ఉండే వీరి ద్వారా ఇంట్లోని వృద్ధులకు అంటుకునే అవకాశాలు ఉన్నాయి. దీన్ని గుర్తించినందువల్లనే విద్యార్థులకు ఎక్కడ అవసరమైతే అక్కడ టెస్టులు చేసేందుకు వీలుగా కిట్లను ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాం.

సరిహద్దు జిల్లాల పరిస్థితి ఏమిటి ?

మహారాష్ట్ర, కర్నాటకల్లో కొత్తగా పుట్టుకొస్తున్న కేసులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. తెలంగాణకు ఈ రెండు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సర్వియలెన్స్ పెంచాం. టెస్టింగులు కూడా ఎక్కువే జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం సగటున రాష్ట్రంలో పాతిక వేల టెస్టులు జరగ్గా ఇప్పుడు రెట్టింపయ్యాయి.

లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి ఉన్నాయంటున్నారు?

అది ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయం. కానీ ఒక వైద్యుడిగా మాత్రం నేను కాస్త వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రజలు (వ్యాక్సిన్ తీసుకున్నవారితో సహా) మాస్కును తప్పనిసరిగా ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం నిబద్ధతతో పాటిస్తే కర్ఫ్యూ, లాక్‌డౌన్ అవసరమే ఉండదు. ప్రజలు బాధ్యతగా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఇప్పుడు కొవిడ్ నిబంధనలు దాదాపుగా ఎవ్వరూ పాటించడంలేదనేదే నా అభిప్రాయం. కేవలం ప్రభుత్వం మాత్రమే కృషిచేయడంతో సంపూర్ణ ఫలితం రాదు. ప్రజల నుంచి కూడా ఆ తరహా సహకారం, చిత్తశుద్ధి అవసరం. కరోనా పోయిందనే భావనతో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కారు.

గతంలోలాగా కేసుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందా?

అది ప్రజల బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. అయినా ప్రభుత్వం తరపున మాత్రం ఏ ఒక్క అవకాశాన్నీ వదలడంలేదు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ అనే మూడు పద్ధతులను మనం పాటిస్తున్నాం. దీంతోనే సగం కంట్రోల్ అవుతుంది. ప్రజల్లో పెరిగిన రోగ నిరోధక శక్తి, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఒకింత ఉపశమనం.

సెకండ్ వేవ్ వచ్చిందని భావించొచ్చునా?

సెకండ్ వేవ్ అని చెప్పలేంగానీ, అలాంటి పరిస్థితి మాత్రం ఉంది. చేయిదాటిపోకుండా ఉండాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది. సెకండ్ వేవ్ గురించి చాలా రకాల వివరణలు ఉండొచ్చేమోగానీ మన దగ్గర మాత్రం ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కూడా లేదు. సెకండ్ వేవ్ అని భయపడాల్సిన పని లేదు. కానీ అజాగ్రత్త మాత్రం పనికిరాదు. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.

వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా ఆందోళన అవసరమా?

వ్యాక్సిన్ వ్యక్తికి మాత్రమే పనిచేస్తుంది. కానీ సమాజానికి కాదు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్ సోకకపోవచ్చు. శరీరంలోకి ప్రవేశించినా తట్టుకోగలుగుతారు. వారికి మాత్రమే వ్యాక్సిన్ ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. కానీ వారిలోకి వెళ్ళిన వైరస్ ఇతరులకు అంటుకుంటుంది. అందుకే వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మాస్కు ధరించాల్సిందే.

వ్యాక్సిన్ వృథా ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం చెప్తోందిగదా!

ఇది సరైనది కాదు. జాతీయ స్థాయిలో సగటున 7.5% వృథా అయితే తెలంగాణలో మాత్రం అది కేవలం 0.76% మాత్రమే. ఒక్క శాతం కంటే తక్కువే. ఇప్పటివరకు సరఫరా చేసిన డోసులు, దాన్ని తీసుకున్నవారి సంఖ్యను చూస్తే తెలిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘కొవిన్’ పోర్టల్, లేదా ‘ఇ-విన్’ పోర్టల్ ద్వారా తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే మరింత స్పష్టమవుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో వృథా చాలా తక్కువ.

కేంద్రం లెక్కలకు, రాష్ట్రం లెక్కలకు తేడా ఎందుకొచ్చింది?

రాష్ట్రానికి ఎన్ని డోసులు సరఫరా చేసిందీ ‘కొవిన్’ పోర్టల్‌లో వివరాలు ఉన్నాయి. ఇప్పటిదాకా 9.93 లక్షల డోసులు వచ్చాయి. ఇందులో ‘కొవిన్’ డాష్‌బోర్డు లెక్కల ప్రకారం 9.43 లక్షల డోసులు హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు ఇచ్చాం. మరో 42 వేల డోసులు మిలిటరీ, పారామిలిటరీ బలగాలకు ఇచ్చాం. మరికొన్ని డోసులు ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బహుశా ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే సప్లయ్ చేసినవాటికీ, వినియోగించినవాటికీ మధ్య తేడాను చూసి వృథా అని భావించింది.

కేంద్రానికి ఈ వివరాలను ఇచ్చారా?

కేంద్రం వ్యాక్సిన్ వృథా గురించి చెప్పిన తర్వాత అది సరైన లెక్కలు కావు అని వీడియో కాన్ఫరెన్సులోనే చెప్పాం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర వైద్యారోగ్య శాఖకు కూడా లేఖ రాసి గణాంకాలను పంపించాం.



Next Story

Most Viewed