రూ. 2 లక్షల కోట్లకు చేరిన ఆ బ్యాంక్ ఎంఎస్ఎంఈ లోన్స్

by  |
రూ. 2 లక్షల కోట్లకు చేరిన ఆ బ్యాంక్ ఎంఎస్ఎంఈ లోన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(ఎంఎస్ఎంఈ)కు ఇచ్చే రుణాలు ఏడాదికి 30 శాతం పెరిగి డిసెంబర్ నాటికి రూ. 2 లక్షల కోట్ల మార్కును చేరుకుంది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం(ఈసీఎల్‌జీఎస్) ద్వారా మహమ్మారి సమయంలో ఎంఎస్ఎంఈలకు బ్యాంకు రూ. 23 వేల కోట్ల రుణాలను ఇచ్చినట్టు వెల్లడించింది. ముఖ్యంగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు పెరగడమే ఈ వృద్ధికి కారణమని బ్యాంకు పేర్కొంది. ఇందులో జౌళి, ఆటో విడిభాగాలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, హోటళ్లు, రసాయనాలు వంటి పలు రంగాల్లోని చిన్న సంస్థలకు ఈ రుణాలను అందజేసినట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుమంత్ రామ్‌పాల్ చెప్పారు. 2019, డిసెంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎస్ఎంఈ రుణాలు రూ. 1.4 లక్షల కోట్లు ఉన్నాయి. ఇది గత డిసెంబర్ నాటికి రూ. 60 వేల కోట్లకు పైగా పెరిగి రూ. 2,01,758 కోట్లకు చేరుకుంది. ఇది బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఎంఎస్ఎంఈ రుణాల్లో 10.6 శాతం వాటా కాగా, ఈ విభాగంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది. తమ ఎంఎస్ఎంఈ రుణాలు కరోనా పూర్వస్థాయికి చేరుకున్నాయని సుమంత్ తెలిపారు.



Next Story

Most Viewed