హర్యానా ప్రభుత్వానికి నేడు ‘పరీక్ష’!

by  |
హర్యానా ప్రభుత్వానికి నేడు ‘పరీక్ష’!
X

చండీగఢ్ : రైతుల ఆందోళన బీజేపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, ఇతర బీజేపీ అధికార రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు పుట్టిస్తున్నది. మరోవైపు ఐదు అసెంబ్లీ ఎన్నికలూ ఇదే తరుణంలో జరగనుండటంతో బీజేపీ కత్తిమీద సాము చేయాల్సి వస్తున్నది. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణలతో బీజేపీ అధికార రాష్ట్రం ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రాజీనామా చేయగా తాజాగా, హర్యానా ప్రభుత్వం అవిశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నది.

మనోహర్ లాల్ ఖట్టార్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఇటీవలే అసెంబ్లీ స్పీకర్‌కు పంపింది. ఈ తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్ 10వ తేదీన ప్రభుత్వానికి పరీక్ష పెట్టడానికి సిగ్నల్ ఇచ్చారు. రైతు ఆందోళనలపై హర్యానాలో బీజేపీ మిత్రపక్షం జేజేపీపై వ్యతిరేకత పెరుగుతున్నది. తాము రైతులకు వ్యతిరేకం కాదంటూనే సర్కారుకు మద్దతు కొనసాగిస్తున్న జేజేపీ వైఖరిని స్పష్టం చేయడానికి కాంగ్రెస్ బలనిరూపణకు డిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు 40 మంది. మిత్రపక్షం జేజేపీ బలం 10 మంది ఎమ్మెల్యేలు. వీటితోపాటు ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతూ ప్రభుత్వానికి ఉన్నది. కాంగ్రెస్‌కు 31 మంది ఎమ్మెల్యేలున్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉండటంతో అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 45కు పడిపోయింది. తమ ప్రభుత్వానికి ముప్పేమీ లేదని సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారని, ఇతర ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా అన్నారు. జేజేపీ రైతుల వైపు నిలుస్తుందా లేదా? అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆ పార్టీపై ఒత్తిడి పెంచారు. ఒకవేళ జేజేపీ మద్దతు ఉపసంహరిస్తే బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడుతుందని కాంగ్రెస్ లెక్కలు కడుతున్నది.

Next Story

Most Viewed