ఆగస్టు 5 నుంచి జిమ్‌లు ప్రారంభం

by  |
ఆగస్టు 5 నుంచి జిమ్‌లు ప్రారంభం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కారణంగా అన్ని రంగాల తరహాలోనే క్రీడారంగం కూడా నష్టపోయిందని పేర్కొన్న మంత్రి శ్రీనివాసగౌడ్ ఆగస్టు 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు యథావిధిగా పనిచేసుకోవచ్చునని, అయితే కొవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని స్పష్టం చశారు. క్రీడాకారులతో పాటు క్రీడాశాఖ అధికారులతో శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా పై విధంగా స్పష్టం చేశారు. కరోనా నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో మాత్రమే ఫిట్‌నెస్ కేంద్రాలు నడవాలని నిర్వాహకులకు సూచించారు.

సోషల్ డిస్టెన్స్ నిబంధనను దృష్టిలో పెట్టుకుని వైరస్ వ్యాప్తి ఒకరి నుంచి మరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లలో పరిశుభ్రతా చర్యలు కూడా తీసుకోవాలని నొక్కిచెప్పారు. స్టేడియంలలో సైతం క్రీడాకారులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రాక్టీసు చేసుకోవాలని సూచించారు. ఇండోర్ స్టేడియంలలో మిరంతా జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ప్రక్రియను నిర్వహించాలన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు శిక్షణ ఇచ్చే కేంద్రాల్లో నిర్వాహకులు మరిన్ని అదనపు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. క్రీడాకారుల నుంచి వచ్చిన కొన్ని సూచనలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

స్టేడియంలలో సైతం పూర్తి సామర్ధ్యంలో సగం మంది క్రీడాకారులు మాత్రమే రోజు విడిచి రోజు ప్రాక్టీసు చేసుకొనేలా క్రీడా శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎలాంటి క్రీడా టోర్నమెంట్ల నిర్వహణకు ప్రస్తుతానికి అనుమతి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్న కొత్త క్రీడా పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక సబ్ కమిటీని వేసిందని, క్రీడాకారులతో పాటు కోచ్‌లు కూడా వారి సూచనలు, సలహాలను ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, బాడ్మింటన్ క్రీడాకారులు సిక్కిరెడ్డి, సాయి ప్రణీత్, సుమిత్ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, క్రీడా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, బ్యాట్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story