కూరగాయల మార్కెట్‌లో రాజ్యమేలుతున్న దుర్గందం

by  |
కూరగాయల మార్కెట్‌లో రాజ్యమేలుతున్న దుర్గందం
X

దిశ, ఆర్మూర్: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందమిది. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచిన అంకాపూర్ గ్రామంలో పారిశుధ్యం పడకేసింది. ఆర్మూర్ మండలంలోని ఆదర్శ గ్రామంగా అంకాపూర్ ఖ్యాతి గడించింది. నిజామాబాద్-వరంగల్ రహదారిపై ఉన్న ఈ గ్రామంలో పెద్ద పెద్ద భవంతులు, రంగుల బంగళాలు సందర్శకులను అమితంగా ఆకర్షిస్తాయి. వ్యవసాయం, అనుబంధ పారిశ్రామిక రంగ సంస్థలు ఈ గ్రామానికి వన్నె తెచ్చాయి. ఇంతటి ఘన కీర్తి గ్రామాభివృద్ధి కమిటీ కృషి ఫలితమే. అయితే అభివృద్ధిపై శ్రద్ధ వహిస్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న అంకాపూర్ వీడీసీ, ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది.

జిల్లాలో డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న దరిమిలా ఈ ఆదర్శ గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ తీరు భయం గొల్పుతున్నది. గ్రామ ప్రధాన ముఖద్వారం పక్కనే ఉన్న కూరగాయల మార్కెట్ షెడ్డు వద్ద దుర్గంధం రాజ్యమేలుతున్నది. షెడ్డు వెనుక వైపు చెత్త కుప్పలు గుట్టలుగా పోసి ఉంచారు. నెలల తరబడిగా చెత్తను తీసివేయకపోవడంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినట్లు తెలుస్తున్నది. పక్కనే ఉన్న కెనాల్ సైతం చెత్తతో నిండిపోతున్నది. కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాల నిమిత్తం ఇక్కడికి రాష్ట్రేతర ప్రాంతాల వారు సైతం వస్తుంటారు. వ్యాపార అవసరాల కోసం ఈ బజారుకు వస్తే ముక్కు పుటలు అదిరిపోతున్నాయంటూ సందర్శకులు ముక్కు మూసుకుంటున్నారు. సుదూర ప్రాంతాల వ్యాపారులు, రైతులతో వ్యాపార సంబంధాలు నేర్పుతున్న అంకాపూర్ వీడీసీ వారి ఆరోగ్యం పట్ల పెద్దగా జాగ్రత్తలేం తీసుకుంటున్నట్లు లేదు. ఈ మార్కెట్ షెడ్డును నమ్ముకొని వందల మంది వ్యాపారులు, హమాలీలు బతుకుతున్నారు. ఉపాధికి మార్గం చూపిన పెద్దలే పరోక్షంగా పేదల ఆరోగ్యాన్ని హరిస్తుండడం గమనార్హం. వ్యాధుల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



Next Story

Most Viewed