బ్లాక్ అండ్ వైట్‌లో.. అలనాటి స్విస్ అందాలు

by  |
బ్లాక్ అండ్ వైట్‌లో.. అలనాటి స్విస్ అందాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : స్విట్జర్లాండ్ అంటేనే అందాల నగరం. 2020లో ఈ నగరమంతా సప్తవర్ణాల మేళవింపుతో సరికొత్తగా దర్శనమిస్తూ స్విస్ వాసుల్ని, పర్యాటక ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. అయితే, ఈ కలర్‌ఫుల్ స్విస్ బ్యూటీని బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో చూస్తే ఎలా ఉంటుంది? అంటే ఇప్పటి స్విట్జర్లాండ్‌ను అనుకునేరు! కానేకాదు, ఒక్కసారి అలా 50 ఏళ్లు వెనక్కి వెళ్లి.. ఆనాటి స్విస్ స్ట్రీట్స్‌ ఎలా ఉన్నాయో జాక్ షార్ప్ అనే ఇంజనీర్ ఫొటోల్లో చూసేద్దాం. ఇంతకీ ఆయనెవరు? స్విస్ అప్పుడు ఎలా ఉంది? ఆ ఫొటోల సంగతేంటి?

కొవిడ్ -19 అందరినీ ఇంట్లోకి నెట్టేసి.. తాను కాపలాగా బయటే ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ కారణంగానే ఎప్పుడో అటక మీద దాచిన తాతయ్య ట్రంకు పెట్టె జ్ఞాపకాలు, నాన్న పుస్తకాల్లో దొరకిన ఎండిపోయిన పూరేకులు, నానమ్మ భద్రంగా దాచుకున్న పెళ్లి చీర.. ఇలాంటివన్నీ మన ముందుకొచ్చేసి అప్పటి జ్ఞాపకాల్ని గుర్తుచేస్తున్నాయి, మనతో కబుర్లు చెబుతున్నాయి. అలానే డైలాన్ స్కాలెట్ అనే కుర్రాడు కూడా తన తాత ‘జాక్ షార్ప్’ ఇచ్చిన వారసత్వ సంపద ఫొటో నెగెటివ్‌లను డిజిటలైజ్ చేయడానికి ‘లాక్‌డౌన్’ పీరియడ్ కలిసొచ్చింది. ఆరేళ్ల నుంచి వాటిని పోస్ట్‌పోన్ చేస్తూ.. చివరకు తన తాత ఫొటోగ్రఫీ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించే రోజు వచ్చింది.

యూకేలోని హరోల్డ్‌లో జన్మించిన జాక్‌షార్ప్.. స్విట్జర్లాండ్‌, జెనీవాలోని ‘సెర్న్’ (CERN) లేబొరేటరీలో ఇంజనీర్‌గా పనిచేసేవాడు. తన 27 ఏళ్ల వయసులో.. అంటే 1955లో సెర్న్‌లో ఉద్యోగం కోసం స్విస్ వెళ్లిన తను ఓ వైపు జాబ్ చేస్తూనే తన ఫొటోగ్రఫీ హాబీని కొనసాగించేవాడు. అలా 1955-70ల నాటి స్విస్ అందాలను తన కెమెరాలో బంధించాడు. ఫొటోగ్రఫీ కోసం ఎంతగానో రీసెర్చ్ చేశాడు. కెమెరా మెకానిక్స్ తెలుసుకున్నాడు. ఎలాంటి లైటింగ్‌లో ఫొటోలు తీయాలనే విషయాలతో పాటు డార్క్ రూమ్ సైన్స్ గురించి తెలుసుకున్నాడు. అలా స్విస్ వీధులను, అక్కడి మనుషుల అలవాట్లను, ఆనాటి వేషధారణను అన్నింటినీ తన కెమెరా కన్నుతో క్యాప్చర్ చేశాడు.

స్కాలెట్ ఈ ఫొటోల గురించి మాట్లాడుతూ.. ‘మా తాత అని కాదు.. నిజంగా ఇవి అద్భుతమైన ఫొటోలు. నేను కూడా ఫొటోగ్రాఫర్‌నే కాబట్టి, నాకు వీటి విలువ తెలుసు. తాతయ్య తీసిన 5 వేల ఫొటో నెగెటివ్స్‌ను డెవలప్ చేశాను. ప్రస్తుతం ఫొటోగ్రఫీలో నేను గ్రాడ్యుయేట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫొటోగ్రఫీలో మరింత పరిశోధన చేస్తాను. తాతయ్య ఈ ఫోటోల కోసం అగ్ఫా సూపర్ సిలెట్టె అపోటార్ 45ఎమ్ఎమ్, అసాహి పెంటాక్స్ కె ఆటో – టాకుమార్ 55ఎమ్ఎమ్ కెమెరాలు ఉపయోగించారు. వెస్ట్ స్విట్జార్లాండ్‌లోని దాదాపు అన్ని ప్రదేశాలను ఆయన కవర్ చేశాడు. జెనీవా, లౌసన్నె, ఫ్రాన్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఫేమస్ ఏరియాలన్నింటినీ తను ఫొటోలు తీశాడు. మా ఫ్యామిలీ అంతా స్విస్‌లోనే ఉంటున్నారు. అయితే, నేను పుట్టేసరికే మా తాతయ్య చనిపోయాడు. నేను తనను కలవలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను’ అని స్కాలెట్ చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed