ఆ గ్రామంలో నినాదం నిజమైంది.. కానీ..

by  |
ఆ గ్రామంలో నినాదం నిజమైంది.. కానీ..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: భీంపూర్ మండలం టేక్డి రాంపూర్ గ్రామం. గతంలో కరంజీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. కొత్తగా ఏర్పడిన టేక్డి రాంపూర్ గ్రామంలో 400 పైచిలుకు జనాభా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అరకొరగా వస్తున్నాయి. జీపీకి భవనం లేక పోవడంతో పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ నిధులు చెత్త తరలించే ట్రాక్టరు నిర్వహణ, కరెంటు బిల్లులను కట్టేందుకే సరిపోతున్నాయి. జీపీ కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి కూడా నిధులు సరిపోడం లేదు. దీంతో రెండు,మూడు నెలలకోసారి చెల్లిస్తున్నారు. కొత్త పనులు మాత్రం ఎక్కడా చేపట్టడం లేదు. వీధి దీపాలు చెడిపోతే.. కొత్తవాటిని మార్చకపోవడంతో చాలా కాలనీలు అంధకారంలో ఉన్నాయి. ఈ విషయమై కాలనీవాసులు గ్రామ సర్పంచ్​ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

నర్సాపూర్(జి) మండలం అంజనీ తండా గ్రామం గతంలో కుస్లి జీపీ పరిధిలో ఉండగా.. కొత్త పంచాయతీగా ఏర్పడింది. 597 మంది జనాభా ఉండగా.. రూ.1.37 లక్షల నిధులు ఒక్కో విడతలో వస్తున్నాయి. రూ.7.50 లక్షలతో ట్రాక్టరు, ట్రాలీ కొనుగోలు చేయగా, ట్యాంకరు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలలకోసారి ఈఎంఐ చెల్లించాల్సి ఉండగా, ఇద్దరు వర్కర్లకు రూ.17 వేలు, కరెంటు బిల్లు రూ.12వేలు, ట్రాక్టరు డీజిల్ బిల్లుకు రూ.10 వేల చొప్పున నెల నెలా చెల్లించాల్సి ఉంది. వీధి దీపాలు చెడిపోతే మార్చాల్సి ఉంటోంది. విలేజ్ పార్కులో మొక్కలు, కంచె, ఇతర వసతులు ఈ నిధుల నుంచే కల్పిస్తుండగా.. నిర్వహణ చూడాల్సి వస్తోంది. ఈ నిధులు ఎటూ సరిపోకపోవడంతోఓ కొత్త పనులు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం గ్రామ పంచాయతీని బంజారా కమ్యూనిటీ హాల్​లో నిర్వర్తిస్తున్నారు.

నినాదం నిజమైనా.. నిరాశే మిగిలింది..

మావ నాటే.. మావ రాజే.. (మా ఊరిలో మా రాజ్యం) అనే నినాదం సాకారమైందనే సంతోషం అంతలోనే ఆవిరైంది.. పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అంటే ఇదే మరి.. దశాబ్దాల ఎదురుచూపులు ఫలించినా.. ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడంతో నిరాశే మిగులుతోంది. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం తండాలు, గూడేలు, ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయగా, కొత్త గ్రామ పంచాయతీల నిర్వహణ భారంగా మారింది. నూతన జీపీలు వచ్చాయనే సంతోషమే తప్ప, రెండేళ్లుగా ఏ అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజల నుంచి చీదరింపులు, ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొంతమంది సర్పంచ్‌లు అప్పులు చేసి అభివృద్ధి చేస్తే.. ఏండ్లు గడిచినా బిల్లులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రజల్లో గౌరవం పోవద్దని అప్పులు చేసి పంచాయతీ నిర్వహణ నెట్టుకొస్తున్న సర్పంచ్‌లు బాధలు వర్ణనాతీతం.

ట్రాక్టర్ల నిర్వహణ.. సర్పంచులకు భారం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,508 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 467, నిర్మల్ లో 396, మంచిర్యాల జిల్లాలో 311, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 334 జీపీలున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో 866 పంచాయతీలు ఉండగా, కొత్తగా 642 ఏర్పడ్డాయి. పల్లెప్రగతిలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకోసం ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లను కొనుగోలు చేశారు. వీటికి కమర్షియల్ వెహికల్స్ (ఎల్లో ప్లేట్)గా రిజిస్ట్రేషన్ చేయించాలి. ప్రతీ వాహనానికి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1200 నెల దాటితే.. నెలకు రూ.25 చొప్పున ఫైన్ చెల్లించాలి. వీటితో పాటుగా ఇన్సూరెన్స్, డీజిల్ వ్యయం ఇలా.. నెలకు గ్రామపంచాయతీ పరిధిని బట్టి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అవుతోంది. ట్రాక్టర్ మెయింటనెన్స్‌కు ప్రతీ సంవత్సరం రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చవుతుంది.

పల్లె ప్రగతికి కొత్త నిధులు ఊసేలేదు..

గ్రామపంచాయతీ ఖర్చులన్నీ ప్రస్తుతం సాధారణ నిధుల నుంచి తీసుకోవాల్సి వస్తోంది. గతంలో పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ, వినోదపు పన్ను, లైబర్రీ సెస్​లు నేరుగా సాధారణ నిధుల ఖాతాలో పడేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కొత్తగా నిధులు విడుదల చేస్తోందని చూపించాలనో.. లేక మరేదైనా కారణమోగానీ, ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఎస్ఎఫ్‌సీ నిధులను కలిపి పల్లెప్రగతి నిధుల పేరుతో మంజూరు చేస్తోంది. వీటిలో ఎస్ ఎఫ్ సీ నిధులు ఐదారు నెలలుగా విడుదల కాకపోగా.. 15వ ఆర్థిక సంఘం నిధులే ఇస్తున్నారు. స్థానికంగా పన్నులతో ఆదాయం రావట్లేదు. సర్పంచ్​లు ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇది సర్పంచ్‌లకు ఆర్థిక భారం తెచ్చిపెడుతోంది. ఎక్కువగా ఏకగ్రీవమైన పంచాయతీల్లో తండాలే ఉండగా, ప్రోత్సాహకాల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు భవనాల్లేక అంగన్​వాడీ, కమ్యూనిటీ అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వకపోగా, నరేగా నిధులతో నిర్మించే ప్రణాళికలు వేస్తున్నారు. గ్రామ పంచాయతీలు పెరిగినా పారిశుధ్య కార్మికులు, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ల కొరత చాలా చోట్ల ఉంది.

సర్పంచ్​లకు తప్పని వేధింపులు..

సాధారణంగా గ్రామపంచాయతీ నిధులు ఉంటేనే సర్పంచ్​లు అభివృద్ధి పనులు చేస్తుంటారు. తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తే.. అప్పు తెచ్చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి వస్తోంది. ప్రతీ గ్రామ పంచాయతీలో హరిత హారంలో భాగంగా నర్సరీల నిర్వహణ, మొక్కలను సంరక్షించడం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణ సర్పంచ్​లకు కొత్త తలనొప్పులను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తేందే తప్ప, నిధులను విడుదల చేయడం లేదు. పనులు మాత్రం త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు నిత్యం సర్పంచ్​లను వేధిస్తున్నారు. సర్పంచులకు ఉన్నతాధికారులు నేరుగా ఫోన్ చేసి, పనులు పూర్తి చేయకపోతే సస్పెండ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో ప్రభుత్వ ఉద్యోగులకు విధించినట్టుగా సర్పంచ్‌లకు టార్గెట్లు విధించి వేధిస్తున్నారనే ఆరోపణలు సైతం లేకపోలేదు.

Next Story

Most Viewed