ఐకేపీ సెంటర్, మిల్లర్ల దోపిడీ.. ధాన్యం తగలబెట్టిన రైతులు

by  |
ఐకేపీ సెంటర్, మిల్లర్ల దోపిడీ.. ధాన్యం తగలబెట్టిన రైతులు
X

దిశ ,పరకాల: వెంకటేశ్వర రైస్ మిల్, ఐకేపీ సెంటర్లు నిలువునా దోచేస్తున్నారని ఆవేదన చెందిన రైతన్నలు ధాన్యాన్ని తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, వెంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యం కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారు అంటూ బుధవారం ఉదయం ఐకేపీ సెంటర్ వద్ద ఉన్న వరి ధాన్యాన్ని పలువురు రైతులు తగలబెట్టారు. పంట కోసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తేమ, తాలు పేరుతో నలభై కిలోల బస్తా మీద 5 కిలోలు తరుగు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంట పండించామని, ఉద్దేశపూర్వకంగానే తేమ పేరుతో రోజుల తరబడి కాంటా నిర్వహించకుండా జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో 5 నుంచి 10 కిలోల తరుగుకు అంగీకరించాల్సి వస్తుందని, గ్రామానికి చెందిన వీరమల్ల రెడ్డి అనే రైతు అన్నారు. అధికారులకు విషయం తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గత్యంతరం లేకనే ధాన్యాన్ని తగలబెడుతున్నామని రైతులు తెలుపుతున్నారు. మిల్లర్లు, ఐకేపీ సెంటర్లు ఇలా రైతులను దోపిడి చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో, అధికార యంత్రాంగం విమర్శలకు గురి అవుతోంది.



Next Story

Most Viewed