13 మంది దుర్మరణం.. మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్

by  |
13 మంది దుర్మరణం.. మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ సైన్యంలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు కూనురు సమీపంలో నీలగిరి కొండల్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మొత్తం 13 మంది దుర్మరణం పాలయ్యారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. తీవ్రకాలిన గాయాలతో చికిత్స పొందుతున్న రావత్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని ట్వీట్ చేసింది. హెలికాప్టర్​లో మొత్తం 14 మంది ఉండగా.. ఈ ఘటనలో గాయపడిన పైలట్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్‌ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మృతదేహాలను డీఎన్​ఏ పరీక్షల ద్వారా గుర్తించనున్నట్లు వెల్లడించింది. రావత్ మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ మరణం.. దేశ సాయుధ దళాలకు తీరని లోటని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

రెండేళ్ల క్రితం సీడీఎస్‌గా బాధ్యతలు..

బిపిన్ రావ‌త్ ఉత్తరాఖండ్‌లోని పూరీలో 1958, మార్చి 16న జ‌న్మించారు. ఆయ‌న తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా సేవలు అందించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ 1978, డిసెంబరు 16న గూర్ఖా రైఫిల్స్‌లోని 5వ బెటాలియన్‌లో బిపిన్ రావత్ చేరారు. నాలుగు దశాబ్దాల సర్వీస్‌లో బ్రిగేడ్ కమాండర్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ -సదరన్ కమాండ్, జనరల్ స్టాఫ్ ఆఫీసర్ గ్రేడ్ 2 వంటి పదవులను నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో కూడా సేవలందించారు. కాంగోలో బహుళ దేశాల బ్రిగేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. 2016, డిసెంబరు 17న భారత సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సైన్యం, నావికా దళం, వాయు సేనలను సమైక్యపరచడం కోసం సీడీఎస్ ప్రధాన లక్ష్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన త్రివిధ దళాల అధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్)కు 2019, డిసెంబరు 31న అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.

ఈ పదవికి నియమితుడైన తొలి సిట్టింగ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆయనే. పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఆయనను ఈ పదవిలో కేంద్ర ప్రభుత్వం నియమించింది. అనేక ఆపరేషన్లలో రావత్ పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని తగ్గించేందుకు కృషి చేశారు. 2016లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోకి చొచ్చుకెళ్ళి నిర్వహించిన సర్జికల్ స్రైక్స్ ప్రణాళిక రూపకర్తల్లో కీలక పాత్ర పోషించారు.

Next Story

Most Viewed