3 కి.మీ రోడ్డు కోసం 30 ఏళ్ల శ్రమ.. ఇన్‌స్పిరేషనల్ స్టోరీ

by  |
3 కి.మీ రోడ్డు కోసం 30 ఏళ్ల శ్రమ.. ఇన్‌స్పిరేషనల్ స్టోరీ
X

దిశ, ఫీచర్స్ : కొండ ప్రాంతంలో ఉన్న ఆ గ్రామానికి రోడ్డుమార్గం లేదు. దీంతో నిత్యావసరాలకు కూడా కిలోమీటర్ల దూరం తిరగాల్సి వచ్చేది. దట్టమైన, విషపూరిత సర్పాలకు కేంద్రంగా ఉన్న ఆ అడవిని దాటాలంటే ఓ సాహసమే. ఈ నేపథ్యంలోనే తమ ఊరిని మెయిన్ రోడ్‌తో కలిపేందుకు కనీసం నడక దారినైనా నిర్మించమని జిల్లా యంత్రాంగాన్ని ఎన్నోసార్లు వేడుకున్నారు. కానీ ప్రతీసారి తిరస్కరణే ఎదురైంది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం అసాధ్యమనే సమాధానమే వినబడేది. ఈ పరిణామాలతో విసుగుచెందిన ఒక గ్రామస్తుడు తనే సొంతంగా రోడ్డు నిర్మాణానికి నడుం బిగించాడు. 30 ఏళ్లపాటు కష్టపడి చివరకు అనుకున్నది సాధించి గ్రామస్తుల కష్టాలకు ముగింపు పలికాడు.

ఒడిషా, నయాగర్ జిల్లాలోని మారుమూల గ్రామం తులుబికి రోడ్డు మార్గం లేదు. తమ అభ్యర్థనను ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో హరిహర బెహరా అనే గిరిజనుడు ఆ పనేదో తనే చేసేందుకు ముందుకొచ్చాడు. ప్రభుత్వం అసాధ్యమని తప్పించుకుంటే.. తలచుకుంటే ఎందుకు సాధ్యం కాదనే విషయాన్ని చేసి చూపించాడు. తన సోదరుడు కృష్ణతో కలిసి 30 ఏళ్ల పాటు శ్రమించిన బెహరా.. ఎట్టకేలకు తనతో పాటు గ్రామస్తులు కలగన్న రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేశాడు. ఇది కేవలం నడకదారికే కాకుండా, వాహనాలు వెళ్లేందుకు వీలుగానూ ఉండటం విశేషం.

20 ఏళ్ల వయసులో మొదలు..

బెహరా, అతని సోదరుడు తమకు ఇరవై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ రోడ్డు పనులు మొదలెట్టారు. ప్రతీరోజు తమ పొలం పనులు ముగిశాక ఈ పనిచేసేవారు. మొదట అడ్డుగా ఉన్న చెట్లను నరికి, తర్వాత తక్కువ స్థాయి పేలుడు పదార్థాలు ఉపయోగించి రాళ్లను తొలగించారు. కానీ బ్లాస్టింగ్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని భావించి సుత్తెలతో రాళ్లను తొలిచేశారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులు సైతం వీరితో చేతులు కలిపారు. అయితే సోదరుడు కిడ్నీ సమస్యతో చనిపోయినా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. తన గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు తలచుకుని లక్ష్యాన్ని పూర్తిచేసేవరకు విశ్రమించని 57 ఏళ్ల బెహరా.. మొత్తానికి తన గ్రామానికి రోడ్డు మార్గం కల్పించాడు.

చుట్టుపక్కల గ్రామాలకు సేవలు..

తన గ్రామంలో రోడ్డు పూర్తిచేసిన బెహరా.. జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాలకు రహదారులు లేవని గ్రహించాడు. ఈ విషయంలో వారికి కూడా సాయపడాలని నిర్ణయించుకున్నాడు. కానీ అదేటైమ్‌లో జిల్లా యంత్రాంగం ఎంటర్ అయింది. బెహరా కృషిని ప్రశంసించిన సబ్-కలెక్టర్ లగ్నజిత్ రౌత్.. రోహిబా విలేజ్ నుంచి భంజానగర్ మీదుగా తులుబికి త్వరలోనే అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed