పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,730 కోట్లు

by  |
పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,730 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పశుసంవర్ధక, మత్స్యశాఖ అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో 1,730 కోట్లను కేటాయించారు. తెలంగాణ ఏర్పడే నాటికి విజయ డెయిరీ పాల సేకరణ సగటున రోజుకు 1,27,462 లీటర్లు మాత్రమే ఉండగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ ఏడాది 2,89,969 లీటర్లకు పెరిగిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం విజయ డెయిరీ తనకున్న రూ.30 కోట్ల అప్పులు చెల్లించడమే కాకుండా, రూ.58.5 కోట్లతో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉందని వివరించారు. విజయ డెయిరీ వార్షిక టర్నోవర్ రూ.676 కోట్ల చేరుకుందని తెలిపారు.

3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ

రెండో విడతలో ప్రభుత్వం 3లక్షల యూనిట్ల గొర్రెల యూనిట్లను పంపిణీ చేపట్టేందుకుగాను బడ్జెట్‌లో రూ.3000 కోట్లను కేటాయిస్తున్నట్టుగా మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.4,584 కోట్లతో 17 లక్షల 2 వేల 737 గొర్రెలను, 3 లక్షల 66 వేల 797 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వివరించారు.

88 శాతం పెరిగిన మత్స్య సంపద

ప్రభుత్వం చేపట్టిన చేప విత్తనాల పంపిణీ ద్వారా రాష్ట్రంలో 2014తో పోలిస్తే ఇప్పుడు 88శాతం మత్స్య సంపద పెరిగిందని చెప్పారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 18,335 జలాశయాల్లో 268.37 కోట్ల చేపపిల్లలను, 11.64 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం ద్వారా ఏడాది కాలంలోనే 3 లక్షల 10 వేల టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల విలువ సుమారు రూ.4,670 కోట్లుగా ఉందని తెలిపారు.



Next Story

Most Viewed