ఖజానాకు కరోనా నాగబంధం !

by  |
ఖజానాకు కరోనా నాగబంధం !
X

– కేసులు, కాసులు రెండూ రాజధాని నగరంలోనే
– ఓ పక్క సడలింపులు మరోపక్క కంటైన్‌మెంటే దిక్కా

దిశ, న్యూస్ బ్యూరో: ప్రజల ప్రాణాలకు లాక్‌డౌన్ తప్పదు. సంక్షేమ పథకాలకు నిధులు అవసరం. లాక్‌డౌన్ ఎత్తేస్తే వైరస్ వ్యాప్తి ఆగదు. ఎత్తేయకుంటే రెవిన్యూ రాదు. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. దేశమంతా ఆంక్షల సడలింపు ఉంటే తెలంగాణలో మాత్రం పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలవుతోంది. వర్తక వాణిజ్యాలన్నీ బందయ్యాయి. కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులు ఆగిపోయాయి. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, ఆసరా పింఛన్లు, మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ రైతుబంధు.. ఇలా ఒకదాని మీద ఒకటిగా అవసరాలు వచ్చి పడుతున్నాయి. చేతిలో డబ్బు లేదు. లాక్‌డౌన్ ఆంక్షల్ని కొనసాగించడమా లేక సడలింపులు అమలుచేయడమా.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్ళు ఇవే.

కరోనా వ్యాప్తి నిరోధానికి దేశంలో లాక్‌డౌన్‌ అమలవుతున్నా ఆంక్షలు మాత్రం సడలుతున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం కొత్త కష్టమొచ్చిపడింది. దేశంలో చాలా రాష్ట్రాలకు రాజధాని నగరం నుంచే కాక మిగతా నగరాల నుంచి కూడా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గుండెకాయ మాత్రం ఒక్క హైదరాబాద్ మహా నగరమే. రాష్ట్ర జీడీపీలో సమారు 60 శాతం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచే సమకూరుతోంది. ఖజానా కళకళలాడాలంటే నగరంలో జన జీవనం సాధారణ స్థితికి రావడం అనివార్యం. మామూలు రోజుల్లో ఉన్నట్లు ఆర్థిక లావాదేవీలు జరగడం కీలకం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన గ్రోత్ ఇంజన్ హైదరాబాద్ నగరమే. రాష్ట్రంలో నమోదైన 1061 కరోనా పాజిటివ్ కేసుల్లో సుమారు 600 దాకా హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. కేంద్రం తాజాగా ప్రకటించిన రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో హైదరాబాద్ నగరంతో పాటు దాన్ని ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయి.

ఓ పక్క హైదరాబాద్ రెడ్‌జోన్‌లో ఉండటం, మరోపక్క సడలింపులకు ఈ జోన్‌లో పరిమిత అవకాశాలే ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వానికి కత్తిమీద సాములా తయారైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ కేసులు ఇప్పటికీ రెండంకెల స్థాయిలో పుట్టుకొస్తూనే ఉన్నాయి. కంటైన్‌మెంట్ జోన్లు కూడా కొనసాగుతున్నాయి. ఏ రోజు తగ్గుతాయో, ఎప్పుడు పెరుగుతాయో అంతుచిక్కడంలేదు. రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌గా మారితే ఎంతో కొంత మామూలు స్థితి నెలకొని కనీసంగానైనా రెవిన్యూ వచ్చే అవకాశం ఉంది. కానీ సడలింపులకు రెడ్ జోన్ అనేది ఆటంకంగా మారింది. నగరంలో మామూలు పరిస్థితులు నెలకొంటే కాస్తయినా ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుంది. కానీ ప్రతీరోజు పాజిటివ్ కేసులు వస్తూనే ఉండటంతో కొంతమేరకైనా ఆంక్షల్ని తొలగిస్తే వైరస్ ఇంకా విజృంభిస్తుందేమోననే ఆందోళన వెంటాడుతోంది.

కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్ల విషయంలో ఇచ్చిన సడలింపుల ప్రకారం సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటిస్తూ సెజ్‌లు, పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభించుకోవచ్చు. ప్రైవేటు ఆఫీసులు కూడా 33 శాతం ఉద్యోగులతో పనిచేయవచ్చు. ఐటీ పరిశ్రమలతో పాటు అనుబంధ సర్వీసులకు, ఎగుమతి ఆధారిత పారిశ్రామిక యూనిట్లలో కార్యకలాపాలకు అనుమతి ఉంది. కానీ హోటళ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, సెలూన్లు, స్పా సెంటర్స్, ఎక్కువ మంది ఒకచోట గుమిగూడి చేసుకొనే సామాజిక వేడుకలకు అనుమతి లేకపోవడంతో ఆ మేరకు రెవిన్యూ కోల్పోక తప్పదు. ఈ మేరకు సడలింపులను బేరీజు వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కార్మికుల క్యాంపులు ఉన్న సైట్లలో భవన నిర్మాణాలు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వలస కార్మికులను స్వస్థలాలకు పోకుండా కాపాడుకోవడం, రెవిన్యూను కొంత మేర సమకూర్చుకునే వెసులుబాటు ఉంది. మామూలు స్థాయిలో కాకపోయినా పరిమితుల మేరకు ప్రభుత్వ ఖజానాకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉంది.

అయితే ఈ సడలింపులను అమలు చేసే క్రమంలో రెడ్‌జోన్‌ కాబట్టి హైదరాబాద్‌లో కరోనా ముప్పును కూడా సీరియస్‌గా తీసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. రాష్ట్రం మొత్తంమీద ఉన్న కంటైన్‌మెంట్ జోన్లలో దాదాపు సగం హైదరాబాద్‌ నగరంలోనే ఉన్నాయి. కొన్ని జోన్లలో కేసులు తగ్గడంతో మామూలు స్థితి ఏర్పడినా.. కొత్త కేసులు పుట్టడంతో కొత్త కంటైన్‌మెంట్ జోన్లు పుట్టుకొస్తున్నాయి. అందులో భాగమే శనివారం హైదరాబాద్ పరిధిలో 15 కొత్త కరోనా పాజిటివ్ కేసులు బయటపడటం, వెంటనే వనస్థలిపురం చుట్టుపక్కల ప్రాంతాలు కంటైన్‌మెంట్ జోన్లుగా మారిపోవడం. ఏక కాలంలో స్వీయ ఆర్థిక ఆదాయ వనరులను సమకూర్చుకోవడం, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ప్రతీరోజూ వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ ఆదివారం సడలింపులపైనా అధికారులతో చర్చించారు. ఐదో తేదీన మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకోవడమే తరువాయి.

Tags: telangana, economy, hyderabad, red zone, lockdown, relaxation, containment, government strategy



Next Story

Most Viewed