గూగుల్ అలర్ట్.. ఆ షాపింగ్ యాప్ షట్‌డౌన్

by  |
గూగుల్ అలర్ట్.. ఆ షాపింగ్ యాప్ షట్‌డౌన్
X

దిశ, ఫీచర్స్ : అమెజాన్‌కు పోటీగా గూగుల్ సంస్థ ‘గూగుల్ షాపింగ్‌ యాప్’ను 2019లో రూపొందించింది. ఈ యాప్ సేవలు అమెరికాలోని వినియోగదారుల కోసం అదే ఏడాది జులైలో అందుబాటులోకి రాగా, ఇండియాలో డిసెంబర్‌ నుంచి మొదలయ్యాయి. ఇందులో వినియోగదారులు కోరుకున్న ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వీలుగా పలు వెబ్‌సైట్‌లకు సంబంధించిన లింక్‌లు ఇస్తారు. కాగా కొన్ని నెలల తర్వాత గూగుల్.. కస్టమర్ కేర్ సపోర్ట్, ప్రైస్ ట్రాక్, లోకల్ షాప్స్ స్టాక్ లిస్ట్ ఫీచర్స్‌తో పాటు గూగుల్ నుంచి నేరుగా కొనుగోలు చేసే ఆప్షన్‌ను జోడించింది. ఇక తాజాగా తన మొబైల్ షాపింగ్ యాప్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్.. ఈ ఏడాది జూన్ నుంచి ఈ మొబైల్ యాప్ ప‌నిచేయ‌ద‌ని వెల్లడించింది.

గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్‌.. వేలాది ఆన్‌లైన్ స్టోర్ల నుంచి గూగుల్ ఖాతాతో షాపింగ్ చేసే సౌలభ్యాన్ని వినియోగదారులకు అందిస్తోంది. అయితే సెర్చింగ్‌, ఇమేజ్ సెర్చ్, యూట్యూబ్ సెర్చ్‌లో షాపింగ్ సౌలభ్యానికి ఆదరణ పెరుగుతున్న సమయంలోనే షాపింగ్ మొబైల్ యాప్‌ను నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది గూగుల్. దీంతో పాటు సెర్చింగ్‌ను మెరుగుపరచడానికి కంపెనీ రియాలిటీ లక్షణాలను పెంచుతున్నట్లు స‌మాచారం. ఈ కారణంగానే జూన్ నుంచి మొబైల్ పరికరాల్లో గూగుల్ షాపింగ్ యాప్ అందుబాటులో ఉండబోదు. కానీ దాని వెబ్ వెర్షన్ మాత్రం కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్‌లో ఏదైనా డేటా ఉంటే, వినియోగదారులు జూన్‌లోగా షిఫ్ట్ చేసుకోవాలని సూచించింది.

‘రాబోయే కొద్ది వారాల్లో, మేము షాపింగ్ యాప్‌నకు మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. షాపింగ్ టాబ్, గూగుల్ యాప్‌తో సహా ఇతర గూగుల్ సర్ఫేస్‌లలో కొత్త ఫీచర్స్ యాడ్ చేయడాన్ని మేము కొనసాగిస్తాం. ఇది ప్రజలు ఇష్టపడే ఉత్పత్తులను కనుగొనడంతో పాటు షాపింగ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది’ అని గూగుల్ పేర్కొంది.



Next Story

Most Viewed