పచ్చని కాపురంలో గూగుల్ మ్యాప్స్ చిచ్చు!

by  |
పచ్చని కాపురంలో గూగుల్ మ్యాప్స్ చిచ్చు!
X

సాంకేతికత అభివృద్ధి చెందితే మనిషి జీవితం సాఫీగా సాగుతుందనే ఉద్దేశంతో రోజుకొక కొత్త టెక్నాలజీని కనిపెడుతున్నారు. గూగుల్ మ్యాప్స్ కూడా అలాంటిదే. ఈ యాప్ కారణంగా ఎంతో మంది క్యాబ్ డ్రైవర్లకు జీవనాధారం దొరికింది. తెలియని ప్రాంతాల్లో తెలిసినట్లుగా వ్యవహరించే అవకాశం లభించింది. ఎవరు ఎక్కడికి ఏ సమయంలో వెళ్లి అక్కడ ఎంతసేపు ఉన్నారో తెలుసుకునే వీలు కలిగింది. కానీ ఈ చివరలో చెప్పిన సదుపాయం.. ఒక మంచి భర్తకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ ఫీచర్ తన దాంప్యత జీవితాన్ని ఎంతలా అల్లకల్లోలం చేసిందంటే, ఆ భర్త గూగుల్ వారి మీద ఫిర్యాదు చేయడానికి నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. ఇంతకీ విషయమేంటంటే…

తమిళనాడులోని నాగపట్టణం జిల్లా మయిలాదుతురైకి చెందిన 49 ఏళ్ల చంద్రశేఖర్ ఓ ఫ్యాన్సీ షాప్‌కు యజమాని. కాగా, గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న టైమ్‌లైన్ అనే ఫీచర్ కారణంగా చంద్రశేఖర్‌ను అతని భార్య చిత్రహింసలు పెడుతోంది. ఈ జీపీఎస్ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్‌తో వినియోగదారుడు ఎక్కడికి ఏ సమయంలో వెళ్లింది, ఎంతసేపు వెళ్లింది తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రోజూ రాత్రి ఇంటికి రాగానే, అతని భార్య గూగుల్ టైమ్‌లైన్ ఓపెన్ చేసి, ఒక్కొక్క ప్రదేశాన్ని చదువుతూ అక్కడికి ఎందుకెళ్లావ్? ఎవరిని కలిశావ్? అని ప్రశ్నిస్తూ అతనికి ప్రశాంతత లేకుండా చేస్తోంది. అయితే నిజంగా అతను వెళ్లిన ప్రదేశాలను చూపిస్తే బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు జీపీఎస్ తేడాల కారణంగా టైమ్‌లైన్‌లో తప్పుడు ప్రదేశాలను కూడా చూపిస్తున్న కారణంగా ఇంట్లో గొడవలు వస్తున్నాయి. దీంతో వేధింపులు తట్టుకోలేని చంద్రశేఖర్ పోలీసులను ఆశ్రయించి గూగుల్ మీద కేసు వేయాలనుకున్నాడు. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story