అనుమతిస్తే ఆ దేవుడే క్షమించడు: సుప్రీంకోర్టు

by  |
అనుమతిస్తే ఆ దేవుడే క్షమించడు: సుప్రీంకోర్టు
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సందర్భంలో దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్రకు అనుమతిస్తే ఆ దేవుడే క్షమించడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జూన్ 23న నిర్వహించాల్సి ఉన్న ఈ రథయాత్రను రద్దు చేయాలని ఆదేశించింది. 10 నుంచి 12రోజుల పాటు జరిగే ఈ దైవకార్యానికి సుమారు 10 లక్షలమంది వస్తుంటారని, కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ సమయంలో రథయాత్రకు ఆహ్వానించడమంటే వైరస్‌ను రమ్మన్నట్టేనని ఒడిశాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వమూ ఆధ్యాత్మిక ప్రాంతాలకు అనుమతినివ్వలేదు కానీ, ఈ రథయాత్ర జరిగితే చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను విచారిస్తూ ‘ఈ రథయాత్రకు అనుమతిస్తే జగన్నాథుడు మమ్మల్ని క్షమించబోడు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే అన్నారు. కరోనా సంక్షోభ కాలంలో అటువంటి కార్యక్రమాలు జరిగితే పెద్దమొత్తంలో ప్రజలు గుమిగూడే ప్రమాదమున్నదనీ, అలా జరగొద్దని వ్యాఖ్యానించారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రథయాత్రను ఈ ఏడాది అనుమతించడంలేదని కోర్టు పేర్కొంటూ స్టే విధించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.

Next Story

Most Viewed