ప్రగతిభవన్‌లో ఉద్యోగ నేతలు: 33% ఫిట్‌మెంట్‌పై చర్చ

by  |
ప్రగతిభవన్‌లో ఉద్యోగ నేతలు: 33% ఫిట్‌మెంట్‌పై చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి ఫలితాలు తేలగానే ఉద్యోగ సంఘాల నేతలు ప్రగతిభవన్‌కు చేరారు. రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్​ అభ్యర్థులు గెలవడంతో పీఆర్సీపై సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతున్నారు. మధ్యాహ్నమే ప్రగతిభవన్‌కు చేరుకున్న ఉద్యోగ సంఘాల నేతలు.. సీఎం అపాయింట్‌మెంట్​ కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్​ ఇరిగేషన్​శాఖ సమీక్షతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో ఉండగా.. ఈ సమావేశం ముగియగానే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించనున్నారు. ప్రగతిభవన్‌లో టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీజీఓ అధ్యక్ష, కార్యదర్శులు మమత, ఏనుగుల సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్​రావు, యూసుఫ్, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్​రెడ్డి, కమలాకర్​రావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జేఏసీ నేత పరిటాల సుబ్బారావు ఉన్నారు.

కాగా మండలి ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ సూచనలతో ఉద్యోగ వర్గాలు అధికార పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం స్పష్టమైంది. దీంతో ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్‌పై సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు ప్రాథమిక నివేదికను సీఎంకు పంపించారు. ఫిట్‌మెంట్‌ను 33 శాతంగా ఇవ్వాలని కోరుతున్నారు. సోమవారం అసెంబ్లీ వేదికగా సీఎం పీఆర్సీ, పదవీ విరమణ పెంపు, సీపీఎస్​ఉద్యోగులకు పెన్షన్​ స్కీం వర్తింపు వంటి అంశాలపై ప్రకటన చేయనున్న విషయం తెలిసిందే. దీనికి ఎన్నికల సంఘం కూడా అనుమతి జారీ చేసింది. నాగార్జున సాగర్​ ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్​ అడ్డంకిగా ఉంటుందనే అనుమానాలు ఉండేవి. కానీ కోడ్ ​అడ్డంకి లేదని, ఈసీ నుంచి అనుమతి వచ్చింది. దీంతో ఉద్యోగులు పీఆర్సీపై సీఎంతో చర్చించేందుకు ప్రగతిభవన్‌కు వెళ్లారు.

ఈ నెల 10న ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ఫిట్‌మెంట్​పై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగ సంఘాలు 30 శాతం వరకు ఇవ్వాలని చెప్పామని, 29 శాతంగా ఇచ్చేందుకు అంగీకారం వచ్చిందంటూ ప్రకటన చేశారు. అయితే మండలి ఎన్నికల్లో రెండు చోట్లా అధికార పార్టీ అభ్యర్థులు గెలిచిన తరుణంలో ఉద్యోగ సంఘాలు 33 శాతం ఫిట్‌మెంట్​ ఇవ్వాలంటూ సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed