హైదరాబాద్‌ రోడ్ల మీద డంప్ యార్డులు.. స్వచ్ఛత అంటే ఇదేనా..!

by  |
హైదరాబాద్‌ రోడ్ల మీద డంప్ యార్డులు.. స్వచ్ఛత అంటే ఇదేనా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా’ మారుతోంది జీహెచ్ఎంసీ వ్యవహార తీరు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను నిర్మూలించి సిటీని ‘స్వచ్ఛ హైదరాబాద్’ చేయాలనుకుంటే రోడ్లన్నీ చెత్తమయంగా మారిపోయాయి. నగరంలో ఇంటింటికీ చెత్త సక్సెస్ ఫుల్ గా చేస్తున్నామనే ధీమాతో నగర రోడ్లపై ఉన్న బహిరంగ ప్రదేశాల్లోని చెత్త డబ్బాలను ఇటీవల తొలగించారు. అయితే నగర జనం మాత్రం ఆ ప్రదేశాలను డంప్ యార్డులుగా తయారు చేస్తున్నారు. ఉన్నతాధికారులు అకస్మాత్తు నిర్ణయాలు, అత్యుత్సాహంతో స్వచ్ఛ సిటీ కాస్తా.. చెత్త సిటీగా మారిపోతున్నది.

గ్రేటర్ పరిధిలో స్వచ్ఛ నగరాన్ని నిర్మించే ఉద్దేశంతో ప్రత్యేక డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఆ తర్వాత మరిచిపోవడం సాధారణంగా మారిపోయింది. నగర ప్రజల్లో అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న జీహెచ్ఎంసీ యంత్రాంగం ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరోసారి గ్రేటర్ సిటీ చెత్త నగరాల జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తాయి. ప్రజలు రోడ్లమీద, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడడంలో భాగంగా 2015లో 25 లక్షల ఇళ్లకు రెండు చెత్త డబ్బాల చొప్పున పంపిణీ చేసి తడి,పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని సూచించారు. అంతేకాదు ఇళ్ల నుంచి చెత్త సేకరించేందుకు మొదట్లో 1,005 స్వచ్ఛ ఆటోలను సమకూర్చగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 2,500లకు చేరుకుంది.

అయితే నగర ప్రజలు చెత్త డబ్బాలను ఇండ్లలో వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇంట్లో ఉత్పత్తయిన చెత్తను దగ్గరలోని చెత్త డబ్బాల్లో వేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున నగరంలో రోడ్లపై ఓపెన్ డంప్ యార్డులు ఏర్పడ్డాయి. న‌గ‌రంలో దాదాపు 1,116 ఓపెన్ గార్బెజ్ పాయింట్లను గుర్తించిన జీహెచ్ఎంసీ అక్కడ పెద్ద సైజు చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి, చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇండ్లల్లో చెత్తను ఓపెన్ డస్ట్ బిన్స్‌ల్లో వేయడాన్ని ప్రజలు అలవాటు చేసుకున్నారు. అయితే జీహెచ్ఎంసీ ప్రధాన ఉద్దేశం ఇంటి నుంచే చెత్తను సేకరించడం కావడంతో ఇటీవల బహిరంగ చెత్త డబ్బాలను పూర్తిగా తీసేశారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. అలవాటు ప్రకారం నగరం ప్రజలు చెత్త డబ్బాలు ఉన్న ప్రదేశాల్లో చెత్త వేయడం పరిపాటిగా మారింది. బల్దియా ట్రాన్స్ పోర్ట్ వాహనాలు అటు రాకపోవడం, తొలగించకపోవడంతో రోడ్లపై గుట్టలు గుట్టలుగా చెత్త కుప్పలుగా పేరుకుపోతున్నాయి.

ఇంటింటి సేకరణ విఫలం

ఇంటింటికీ చెత్తను సేకరించడం 95శాతం మేరకు సక్సెస్ అవడంతోనే బహిరంగ చెత్త డబ్బాలను తొలగించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంటి నుంచి చెత్త సేకరించే వ్యవస్థ పటిష్టంగా పనిచేయడం లేదు. వారంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే చెత్త కలెక్షన్ చేస్తుండటంతో ‘ఇంటింటి చెత్త సేకరణ’ ముందుకు సాగడం లేదు. ఇప్పుడు బహిరంగ చెత్త డబ్బాలను తొలగించడంతో రోడ్లపైనే చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో పాటు చెత్త సేకరణ కార్యక్రమం ముందుకు సాగకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ‘స్వచ్ఛ భారత్’ ర్యాంకింగ్స్‌ లో ప్రతీ ఏడాది జీహెచ్ఎంసీ తగ్గుతూ వస్తోంది. ఏటా ‘స్వచ్ఛ హైదరాబాద్’ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్న హైదరాబాద్ ఇప్పుడు మరింత చెత్త నగరంగా మారుతోంది. చెత్త నిర్వహణ సరిగా లేని సందర్భంలో అధికారులు తీసుకున్న నిర్ణయం జీహెచ్ఎంసీ ప్రతిష్టను మరింత మసకబారుస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed