బ్రేకింగ్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జీహెచ్ఎంసీ మేయర్

by  |
బ్రేకింగ్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జీహెచ్ఎంసీ మేయర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. కొత్తగా మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఇప్పటికీ పలువురు హై- ప్రొఫైల్‌డ్, రాజకీయ, సామాజిక నాయకులు వస్తుండటంతో కొనసాగుతోంది. ఇదే అవకాశంగా తీసుకున్న బల్దియా మేయర్ తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాలంటూ కలిసిన వారందరికీ కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తూ హామీ తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారిక కార్యాలయాల్లో, అధికారులు, రాజ్యాంగబద్ధ హోదాలో అభ్యర్థులకు ప్రచారం చేయకూడదు. అయితే, బల్దియా మేయర్ స్వయంగా ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్ వేదికగా రాజకీయ ప్రచారం చేస్తుండటం గమనార్హం.

గురువారం సాయంత్రం జీహెచ్ఎంసీ కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవిని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నమూనా బ్యాలెట్ పత్రాలను కూడా మహిళా ప్రతినిధులకు అందించారు. స్వయంగా మేయర్ ఓటేయాలని కోరడంతో స్వచ్చంధ సంస్థ సభ్యులు సైతం తమ పరిధిలోని ఆరు వేల ఓట్లను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే వేసేలా చూస్తామని హామీనిచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్‌ అధికారిక ఛాంబర్‌లో ఈ ప్రచారం జరుగుతోంది.

అదే ప్రధాన కార్యాలయంలోని మూడో అంతస్తులోనే ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం ఉంది. మేయర్ కార్యాలయంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించడం, మేయర్‌ను కలిసేందుకు వచ్చిన వారిని అధికార పార్టీకి ఓటేయాలని సూచించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అంటూ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటర్నింగ్ కార్యాలయం ఉన్న భవనంలో ఇలా జరుగుతున్న తీరు అధికార పార్టీకి జీహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా కొమ్ముకాస్తున్నారో అర్థం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాను వివరణ కోరగా.. స్పందించేందుకు ఆమె నిరాకరించారు.



Next Story

Most Viewed