నేడే బల్దియా కౌన్సిల్ సమావేశం.. కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల సంగతేంటి..?

by  |
నేడే బల్దియా కౌన్సిల్ సమావేశం.. కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల సంగతేంటి..?
X

దిశ, సిటీ బ్యూరో : కోటిన్నర జనాభా కల్గిన మహా నగరాభివృద్ది, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించే జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలి సమావేశం మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వర్చ్యువల్ పద్దతిలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ తమ మొట్టమొటి సమావేశాన్ని వర్చ్యవల్ పద్ధతిలో నిర్వహించటాన్ని బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే 150 మంది కార్పొరేటర్లు, 59 మంది ఎక్స్ అఫిషియూ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా సిస్కో వెబెక్స్ మీటింగ్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు వినతులు పంపారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు వేలాది మందితో సభలు, సమావేశాలు నిర్వహిస్తే లేని కరోనా నిబంధనలు కౌన్సిల్ మీటింగ్ కే వర్తిసాయా? అని ఉప్పల్ కాంగ్రెస్ కార్పొరేటర్ తప్పుబట్టగా, మొదటి సమావేశాన్ని వర్చ్యువల్ గా నిర్వహిస్తే ఆశించిన ఫలితం దక్కదని, మొట్టమొదటి సమావేశమైనందున భౌతికంగానే నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్ల డిమాండ్ చేయటమే గాక ఎప్పటిలాగే భౌతికంగా నిర్వహించాలని కోరుతూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి, కమిషనర్ లోకేశ్ కుమార్ లకు వినతిప్రతం కూడా సమర్పించిన సంగతి తెలిసిందే.

కానీ బీజేపీ కార్పొరేటర్లు తాము అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత వ్యతికరించటం ఏమిటీ? ఇప్పుడు తామేం చేసేదీ లేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తేల్చి చెప్పిన నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశ నిర్వహణ ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఏడో అంతస్తులోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మేయర్ మంగళవారం నిర్వహించనున్న ఈ వర్చ్యువల్ మీటింగ్ కు మజ్లీస్ కార్పొరేటర్లు మాత్రం తామంతా దారుస్సలాం నుంచే ఈ మీటింగ్ లో పాల్గొంటామని ఇప్పటికే తేల్చి చెప్పగా, ఇప్పటికీ వ్యతిరేకిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఈ సమావేశానికి హజరవుతారా? బహిష్కరిస్తారా? లేక హాజరై తమ నిరసనను తెలియజేస్తూ వాకౌట్ చేస్తారా? వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభమైన తర్వాత జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చేసి అక్కడ నిరసన వ్యక్తం చేయాలని కొందరు బీజేపీ కార్పొరేటర్లు యోచిస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed