స్మార్ట్‌ఫోన్‌కు విశ్రాంతినివ్వండి..

by  |
స్మార్ట్‌ఫోన్‌కు విశ్రాంతినివ్వండి..
X

దిశ, హైదరాబాద్ :
‘నగరంలో ప్రయాణిస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్లకు కొంత విశ్రాంతినివ్వండి..ఏదైనా ముఖ్యమైన కాల్ వస్తేనే మాట్లాడండి..వాహనంలో కూర్చొని పరిస్థితులను పరిశీలించండి..శానిటేషన్, లైటింగ్, వాటర్ లీకేజీలు, రోడ్లపై ఏర్పడిన గుంతలను గమనించండి’ అని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ అధికారులకు సూచించారు. బుధవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో నిరక్షరాసుల సర్వే, యాచకుల సర్వే – పునరావాసం, బస్తీ దవాఖానలు, ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణం, చెరువుల సంరక్షణ, నగర శివారు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, శానిటేషన్, నాలాల్లో పూడికతీత తదితర అంశాల గురించి చర్చించారు. వివిధ జంక్షన్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ప్రధాన రోడ్లపై జరుగుతున్న యాచక ప్రక్రియను నాలుగైదు రోజులు గమనించి, మార్చి రెండో వారంలో యాచకులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నైట్ షెల్టర్స్‌లో తాత్కాలికంగా 24 గంటల పాటు భోజన వసతితో పాటు రిక్రియేషన్‌కు దినపత్రికలు, టెలివిజన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అనాథలు, వృద్ధుల ఆశ్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల పనితీరును గమనించి, ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్న ఏజెన్సీలకు యాచకుల పునరావాస కేంద్రాల నిర్వహణను అప్పగించనున్నట్లు తెలిపారు. ప్రతి జోన్‌కు 500 చొప్పున ఆధునిక పద్ధతిలో నగరంలో కొత్తగా 3 వేల పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని, అందులో భాగంగా 1661 లొకేషన్స్ గుర్తించినట్లు తెలిపారు. మిగిలిన 1339 లొకేషన్లను కూడా గుర్తించాలని ఆదేశించారు. ప్రతి చెరువు వద్ద వాచ్ టవర్, సీసీ కెమెరాలు, సెర్చ్ లైట్‌తో పాటు సెక్యూరిటీ గార్డ్‌ను నియమించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. శానిటేషన్‌ను మెరుగుపరచడంలో భాగంగా ప్రధాన రోడ్లపై ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లు, వ్యాపార సంస్థల ముందు తప్పనిసరిగా రెండు డస్ట్ బిన్‌లను వారిచేతనే ఏర్పాటు చేయించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఈ.వీ.డీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమిషనర్లు జె.శంకరయ్య, జయరాజ్ కెనడి, బి.సంతోష్, ప్రియాంక అలా, జోనల్ కమిషనర్లు ప్రావీణ్య, వి.మమత, ఎన్.రవికిరణ్, బి.శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, అశోక్ సామ్రాట్, చీఫ్ ఇంజనీర్ జియా ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed