కరోనాను మించి కమ్మేసింది.. కళ్లముందే నరకం!

by  |
కరోనాను మించి కమ్మేసింది.. కళ్లముందే నరకం!
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం వాసులు తెల్లారేసరికి నరకాన్ని చూశారు. ప్రత్యక్ష సాక్షులు, చికిత్స తీసుకుంటున్న వారి కథనా ప్రకారం.. ప్రతి రోజూలానే వెంకటాపురం గ్రామం కూడా గత రాత్రి ఆహ్లాదకరంగా గడిపింది. గత నెల రోజులుగా సాయంత్రమైతే చాలూ ఎవరూ బయటకు వెళ్లడం లేదు. పగలు చుట్టుపక్కల వారిని పలకరించినా సాయంత్రమయ్యేసరికి కాసేపు టీవీ చూసి, ఇంట్లో వాళ్లతో కబుర్లాడి, భోంచేసి నిద్రపోతుంటారు.

అలాగే గత రాత్రి కూడా జరిగింది. తెల్లవారే సరికి ముంచుకొచ్చే ఉపద్రవాన్ని ఎవరూ ఊహించలేదు. ఒక్క రాత్రి కాళరాత్రిగా మిగులుతుందని ఏమాత్రం అంచనా వేయని ఆర్ఆర్ వెంకటాపురం వాసులు ఎప్పట్లాగే నిద్రలోకి జారుకున్నారు. వేకువ జామున ఊరిమీదికి విషయవాయువులు కమ్మేశాయి. గ్రామంలోని పశు పక్షులనే కాదు గాలిపీల్చే ఏ జీవినీ విషవాయువు వదల్లేదు. చెట్లు మాడి మసైపోయాయి. జంతువుల్లో కల్లోలం రేగింది. ఏంటో చూద్దామని అనుకునేలోపు ఊపిరాడని పరిస్థితి. ప్రాణాలరచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన ప్రజలు రోడ్ల మీదే పిట్టల్లా పడిపోయారు.

కళ్ల ముందే చిన్నారు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు కూరుకుపోయారు. తమను తాము రక్షించుకునేందుకు ఏం చేయాలో తెలియని దుస్థితి. ఇళ్లు వదిలి పరుగులు తీసిన వారు కొందరైతే, ఇంట్లోనే సురక్షితమంటూ తలుపులు బిగించి ఇళ్లలోనే స్పృహ కోల్పోయిన వారు మరికొందరు. ఆర్ఆర్ వెంకటాపురంలో ఎటు చూసిన హృదయవిదారక దృశ్యాలే. ఎవర్ని కదిపినా కడివెడు కన్నీళ్లే. కెమికల్ తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నప్పటికీ అటువెళ్లేందుకు ఎవరికీ ధైర్యం చాలడం లేదు.

ఇప్పటికే కరోనాతో పోరాడుతున్న విశాఖవాసులు ధైర్యం చేసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బంధువులెలా ఉన్నారో చూసేందుకు వెళ్లిన చాలా మంది వారి దుస్థితి చూసి తల్లడిల్లిపోయారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని వారందన్నీ పోలీసులు తరలించారు. కేజీహెచ్‌లో బాధితులు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో చిన్నారులే ఎక్కువ మంది కావడానికి తోడు వారికి అండగా నిలవాల్సిన పెద్దలు కూడా వారిలానే బాధితులుగా మారండంతో వారిని సముదాయించేవారే కరువయ్యారు. ఎవరినైనా ముట్టుకుంటే కరోనాను మించి గాలిపిల్చితే మరణించే పరిస్థితి వెంకటాపురం వాసులకు నరకం చూపించింది.

tags: rr venkatapuram, vizag, styrene chemical leak, lg polymers

Next Story

Most Viewed