గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా.. ప్రజల నుంచి నిలువు దోపిడీ

by  |
గ్యాస్ ఏజెన్సీల అక్రమ దందా.. ప్రజల నుంచి నిలువు దోపిడీ
X

దిశ, తాండూరు: రాష్ట్రంలో ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీల నిలువు దోపిడీకి గ్రామీణ ప్రాంతాల సామాన్య ప్రజల విలవిలలాడుతున్నారు. రవాణా చార్జీల పేరుతో సిలిండర్ పై 50 రూపాయల నుండి 60 రూపాయల వరకు అధిక ధరలు వసూళ్లు చేస్తున్నా.. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. గ్యాస్ చమురు సంస్థలు ఏజెన్సీల వారీగా రవాణా చార్జీలు కలుపుకుని మొత్తం 970 రూపాయలకు సిలిండర్ సప్లై చేయాలనే నిబంధనలు ఉన్నా.. రవాణా చార్జీలు అంటూ గ్యాస్ ఏజెన్సీలు కొత్తరకం దోపిడీకి పాల్పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. రోజుకో కొత్త ధర అంటూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై పెంచుకుంటూ పోతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నా.. తామేం తక్కువనా అంటూ ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. తాండూర్ నియోజకవర్గంలో సుమారు మూడు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిండికేట్ లాగా ఏర్పడి రవాణా చార్జీల పేరుతో ఇష్టం వచ్చినట్లు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు.

గత వారం క్రితం తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఉప సర్పంచ్ అధిక వసూళ్లపై నిలదీయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా తాండూర్ మండలం కరణ్ కోట్ గ్రామంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బోయ అశోక్ నిలదీయడంతో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల ఆగడాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈ విషయమై తాండూరు పట్టణ ఎమ్మార్వో చిన్నప్పలనాయుడును వివరణ కోరగా.. రవాణా చార్జీలు, ఏజెన్సీ కమిషన్ మొత్తం కలుపుకొని 970 రూపాయలు మాత్రమే సిలిండర్‌కు చెల్లించాలని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు రవాణా చార్జీల పేరుతో ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, అలా చేస్తే ఏజెన్సీలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీల అక్రమ వసూళ్ల పర్వం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు తలెత్తుతున్నాయి.

Next Story

Most Viewed