విభిన్నంగా వినాయక చవితి

by  |
విభిన్నంగా వినాయక చవితి
X

దిశ, వెబ్ డెస్క్‌: కరోనా మహమ్మారి వల్ల..2020 గురించి అందరూ మర్చిపోండని ఇప్పటికే జోకులు వేయడం మనందరికీ తెలిసిన విషయమే. కొవిడ్ ఎఫెక్ట్‌తో ఈ ఏడాది పండుగలు కూడా భిన్నంగానే సాగుతున్నాయి. తొలి పండుగ ఉగాది నుంచి మొదలైన ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. షడ్రుచుల సంగతి పక్కన పెడితే.. ఉన్నదాంతో పచ్చడి చేసి..వచ్చే పండుగకు అందరూ బాగుండాలని, కరోనా త్వరగా ఈ ప్రపంచాన్ని వీడి పోవాలని మొక్కుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రీరామనవమికి అందరూ ఇంటికి పరిమితమయ్యారు. రాఖీ పండుగ కూడా డిజిటల్ తెరమీద జరుపుకున్నాం. ఇక పంద్రాగస్టు వేడుకలు ఇంట్లోనే ముగించుకున్నాం. ఆఖరకు ఇంత కష్టకాలంలో దేవుని దగ్గరకు వెళ్లి పూజ చేయించుకుందామన్నా ఆ భాగ్యం లేకుండా దర్శనాలకే పరిమితం అయిపోయింది. ఇక ఏ ఆపద వచ్చినా ఏ పూజ చేసిన మొట్టమొదటగా వేడుకునే దేవుడు..విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి కూడా కరోనా ఆంక్షలు మొదలయ్యాయి.

ఊరు-వాడ, చిన్నా-పెద్ద.. అందరూ ఏకమై..కుల, మతాలకు అతీతంగా ఐకమత్యమే అనుబంధంగా జరుపుకునే పండుగ ‘వినాయక చవితి’. ఈ పండుగ వస్తుందంటే చాలు అందరిలోనూ ఉత్సాహాం కనిపిస్తుంది. సందు సందులోనూ సందడి సందడిగా ఉంటుంది. మదిమదిలోనూ.. భక్తిభావం పరవళ్లు తొక్కుతుంది. నవరాత్రులు ప్రతి వాడ ఓ పుణ్యక్షేత్రం అయిపోతుంది. ప్రతి ఊరు దేవుని పాటలతో మారుమోగిపోతుంది. కానీ, దేశవ్యాప్తంగా కరోనా వల్ల గణేశుడి ఉత్సవాలపై ఆంక్షలు విధించడంతో..ఆ పండుగ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ఏ మోమూలోనూ ఆ సంతోషం విరబూయడం లేదు.

కరోనా ఆంక్షలతో గణేశ్ ప్రతిమలను పరిమితంగా పెట్టుకోవడంతో..భక్తులు ఒకే చోటుకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకేసారి భక్తులను అనుమతించే అవకాశం లేదు. ఫిజికల్ డిస్టెన్స్ కూడా పాటించేలా గణేశ్ మండప నిర్వహాకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శానిటైజర్లు, డిస్‌ఇన్ఫెక్ట్ డివైజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దర్శనానికి మాస్క్ తప్పనిసరి అంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. అంతేకాదు..సామూహిక పూజలు ఈసారి కనిపించే అవకాశం లేదు. జూమ్ , ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా ఏకదంతుడ్ని కొలిచేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. డిజిటల్ తెరమీదనే.. పూజ చేయించుకోవడం హారతి అందుకోవడం, ఆరగింపులు..వినతులు అన్నీ కూడా డిజిటల్ సాక్షిగా జరగనున్నాయి.

విభిన్న రూపాల విఘ్నేశ్వరుడు :

బొజ్జ గణపయ్య విగ్రహాలనగానే.. అనేక రూపాలు మనముందు సాక్షాత్కారమవుతాయి. వినాయకుడి విగ్రహాల తయారీలో కళాకారుడి సృజనాత్మకతకు జోహార్ అనాల్సిందే. ఈ సారి మాస్క్ ధరించిన వినాయకులు, కరోనా వైరస్‌ను అంతమొందించే వినాయకులు ఎక్కువగా కనిపించనున్నాయి. అయితే కొన్ని ఏండ్లుగా ఎకో గణేశ్ ప్రతిమలను పెట్టుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఎప్పుడు భారీ గణేశుడని తయారుచేసే ఖైరతాబాద్ ఉత్సవ నిర్వహకులు కూడా ఈసారి మట్టితో గణేశుడ్ని తయారు చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కూడా..సీడ్ గణపతులు పెట్టుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఇంట్లోనే గణపతులు పెట్టుకునే అవకాశం ఉండటంతో..చాలా వరకు మట్టి గణపతులు పెట్టుకునే అవకాశం ఉంది.

వినాయక మండపాల దగ్గర సేవా శిబిరాలను ఏర్పాటు చేయడం ఏటా ఆనవాయితీగా వస్తున్న సంగతే. చాలామంది తమ మండపాల దగ్గర రక్త దాన క్యాంప్‌లు, అన్నదానం నిర్వహించడం చేస్తుంటారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం, అనాథశ్రమాల పిల్లలకు పండ్లు, ఇతర వస్తువులు ఇవ్వడం లాంటివి చూస్తేనే ఉన్నాం. ఈసారి కూడా ఆ సంప్రదాయం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ముంబై నగరంలో సుప్రసిద్ధ లాల్‌బాగ్‌చా మండపం నిర్వాహకులు, కరోనా రోగులకు ప్లాస్మా దానం కోసం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముంబై నగర బీజేపీ శాఖ వినాయక నిమజ్జనం కోసం ప్రత్యేకంగా రథాన్ని ఏర్పాటు చేసింది. ఆ రథంలో నీళ్ల ట్యాంకులు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి గణేశుల్ని అందులో నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టింది. విఘ్నాలు తొలగించే.. విఘ్నేశ్వరుడు కొలువు తీరి.. కరోనాకు చరమగీతం పాడుతాడని యావత్ భారతావని కోరుకుంటోంది.



Next Story

Most Viewed