గాల్వన్ ఘటన దురదృష్టకరం

by  |
గాల్వన్ ఘటన దురదృష్టకరం
X

న్యూఢిల్లీ: గాల్వన్ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత చైనా మెత్తబడింది. కలిసిమెలిసి ఉండాలని, పరస్పరం తోడ్పాటు అందించుకోవాలనే స్నేహపూర్వక మాటలను వల్లించింది. గాల్వన్ ఘటన దురదృష్టకరమని, దానివల్ల ఏర్పడిన పరిస్థితులను సద్దుమణిగించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చైనా దౌత్య అధికారి అన్నారు. భావజాలం ఆధారంగా హద్దులు గీసుకునే పాత ఆలోచనా సరళిని మానుకోవాలని, ఒకరు పొందడానికి మరొకరు కోల్పోవాలనే పురాతన ఆటలను కట్టిపెట్టాలని అంబాసిడర్ సన్ వెయిడంగ్ తెలిపారు. ఇటీవలే ఒక దురదృష్టకర ఘటన జరిగిందని, అలాంటి ఘటనలను ఇరుదేశాలు కోరులేదని, చరిత్రలో దాని పరిధి స్వల్పమని అన్నారు.

భారత్, చైనాలు శాంతియుతంగా మెలిగి వివాదాలను వదిలిపెట్టాలని చెప్పారు. రెండు భారీ ఆర్థిక వ్యవస్థలు పరస్పరం అయస్కాంతం వలే ఆకర్షించుకోవాలని, బలవంతంగా దూరమయ్యేలా ఉండరాదని వివరించారు. భిన్నత్వాలతో ప్రపంచం అందంగా ఉంటుందని, ఈ తేడాలను అవగాహన చేసుకుంటూనే కలిసి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. చైనా ఇతరదేశాల విధానాలను దిగుమతి చేసుకోదని, చైనా మాడల్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేయదని, అలాగే, ఇతర దేశాలు ఒకరి విధానాలను మరొకరు అనుకరించాలని అడగరని అధ్యక్షులు చెప్పారని అన్నారు. అందుకే ప్రజల ద్వారా అభివృద్ధి చెందిన నాగరికతను విశాల దృక్పథంతో తాము చూస్తామని, పరస్పరం నేర్చుకోవాలని, సహకరించుకోవాలనే వైఖరినే ఆచరిస్తామని వివరించారు.

Next Story

Most Viewed