కేసీఆర్ ఇలాఖాలో హరీశ్ రావుకు చేదు అనుభవం

by  |
Harish-rao
X

దిశ ప్రతినిధి, మెదక్ : తెలంగాణ ఉద్యమ గడ్డగా పేరొందిన సిద్దిపేట జిల్లాలో అధికార టీఆర్ఎస్‌కు నిరసన సెగలు ప్రారంభమయ్యాయి. సొంత పార్టీ నాయకులే పలుచోట్ల గతంలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావుకు సైతం నిరసన తెగ తగిలింది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి వచ్చిన మంత్రి హరీశ్ రావును గ్రామస్తులు అడ్డుకున్నారు.

అర్హులైన వారిని కాదని అధికార పార్టీ నాయకులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, రేపు(మంగళవారం) మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో సైతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఉంది. దీంతో, గ్రామానికి చెందిన చాకలి మహేష్ అనే యువకుడు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన లిస్టులో తమ పేరు లేదని అధికారుల ముందే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు యువకుడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వెంటనే రేపు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభం కార్యక్రమాన్ని రద్దు చేయాలని మంత్రి అధికారులకు సూచించినట్టు సమాచారం.

మంత్రిని అడ్డుకున్న చాట్లపల్లి గ్రామస్తులు..

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావును అడ్డుకున్నారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతుండగా మహిళలు లేచి అర్హులైన వారికి డబుల్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలో చాలా మంది పేదవారు ఉన్నారని కొన్ని మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి.. టీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా ఉన్న వాళ్లకే ఇచ్చారని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రశ్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ప్రారంభమైన నిరసన సెగలు..

పేరుకే సీఎం కేసీఆర్ సొంత జిల్లా.. పైన పటారం.. లోన లొటారం అన్న మాదిరిగా ఉందని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. దేశానికే ఆదర్శమని చెప్పుకుంటున్న సిద్దిపేట పట్టణంలో నిన్న కురిసిన వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. దీనిపై అధికార టీఆర్ఎస్ నేతలతోపాటు ప్రతిపక్ష నాయకులు, సామాన్య ప్రజలు విమర్శలు గుప్పించారు. కాగా, సోమవారం కూడా జగదేవపూర్ మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలోనూ కొందరు మహిళలు లేచి మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. రేపు కూడా మర్కూక్‌లో ఇదే పరిస్థితి ఏర్పడుతుందని భావించిన మంత్రి హరీశ్ రావు ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

అయితే, ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా మున్ముందు మరిన్ని పరిణామాలు చోటు చేసుకోనున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజల అవసరాలు తీర్చాలని, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో మంత్రికి డిపాజిట్ కూడా కష్టమేనంటున్నారు.


Next Story

Most Viewed