త్వరలో మౌలిక రంగానికి మరో ప్యాకేజీ!

by  |
త్వరలో మౌలిక రంగానికి మరో ప్యాకేజీ!
X

దిశ,వెబ్‌డెస్క్: గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక ప్యాకేజీ సిద్ధం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు తెరదీస్తూ..కేంద్ర ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం, ఆర్థిక వ్యవహరాల విభాగం ప్రత్యేక ప్యాకేజీ కోసం కసరత్తు చేస్తున్నాయని, ఈ ప్యాకేజీతో దేశం మొత్తానికి ప్రయోజనాలు ఉంటాయని కేంద్ర రవాణా శాఖా కార్యదర్శి గిరిధర్ అరమానే పేర్కొన్నారు. కరోనా వ్యాప్తితో పాటు సుదీర్ఘ లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం దేశ మౌలిక వసతుల రంగం బాగా దెబ్బతింది. దీన్ని అధిగమించడానికి కేంద్రం ప్రత్యేక ఉద్దీపన పథకాన్ని సిద్ధం చేస్తోందని, త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సభ్యులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయం వెల్లడించారు.

ఈ వారంలో ప్యాకేజీని ప్రకటిస్తారని నితిన్ గడ్కరి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అధిక ప్రాధాన్యత ఇస్తోందని, హైవేలు, రోడ్డు రవాణా, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్యాకేజీ ఉంటుందా లేదా అనే ప్రశ్నకు సమాధానంగా..వాటి సంగతెలా ఉన్నప్పటికీ మౌలిక వసతుల రంగానికి అవసరమైన ప్యాకేజీ ఉంటుందని గడ్కరి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా రంగం మినహాయించి అన్ని రంగాలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ అన్ని రంగాలకు ముఖ్యంగా పేద ప్రజలకూ, రోజువారీ కూలీలకు ఉపయోగపడేలా ఉండాలి. ప్రజల ఆకలి తీర్చేందుకు అనువైన ప్యాకేజీ అవసరముంది. గతంలో కేంద్రం రూ. 1.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. దీనివల్ల కొందరికి ప్రయోజనం ఉన్నప్పటికీ ఇంకా దేశంలో అనేకమందికి ప్రయోజనాలు అందాల్సి ఉంది. క్షేత్రస్థాయి అమలులో కొన్ని లోపాలున్నట్టు ఆయా రాష్ట్రాలు గుర్తిస్తున్నాయి. మూడో దశ లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరో భారీ ప్యాకేజీ ఉండాలని దేశం మొత్తం కోరుకుంటోంది. లాక్‌డౌన్ అనంతరం తిరిగి వ్యాపారాలను కొనసాగించడానికి, జరిగిన నష్టాల నుంచి కోలుకోవడానికి సంవత్సరం పడుతుందని చిన్న, మధ్య తరహా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను గుర్తించి మరో ప్యాకేజీ కేంద్రం ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed