రీమార్కబుల్ జర్నీ.. వాచ్‌మన్ టు అసిస్టెంట్ ప్రొఫెసర్

by  |
రీమార్కబుల్ జర్నీ.. వాచ్‌మన్ టు అసిస్టెంట్ ప్రొఫెసర్
X

దిశ, ఫీచర్స్ : నిరాశచెందకుండా ప్రయత్నించాలే గానీ.. ఏదో ఒకరోజున అనుకున్నది సాధించి తీరుతాం! కానీ అంతవరకు పట్టు వదలద్దు, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. అప్పుడే ప్రపంచానికి నీ గెలుపు కేక వినిపిస్తుంది. ఈ రోజు మనం ఎలా ఉన్నది కాదు, రేపు ఎలా ఉండాలనుకుంటున్నామన్నదే ముఖ్యం. ఈ మాటలన్నీ కేరళ, పునాథుర్ గ్రామానికి చెందిన రంజిత్ రామచంద్రన్‌‌కు చక్కగా సరిపోతాయి. ఓ సాధారణ వాచ్‌మన్ స్థాయి నుంచి ఐఐటీ ప్రొఫెసర్‌గా ఎదిగిన రంజిత్ స్ఫూర్తిదాయకమైన స్టోరీ మీరూ తెలుసుకోండి..

మధ్య తరగతి జీవితాలంటేనే ఆర్థిక కష్టాలకు కేరాఫ్‌గా చెప్పొచ్చు. రంజిత్ రామచంద్రన్ కూడా అలాంటి ఓ పేదింటికి చెందిన అబ్బాయే. ఇంటర్ వరకు ఎలాగోలా చదువు కొనసాగించిన రంజిత్.. ఆ తర్వాత చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కాసర్‌గడ్‌లోని పనతూర్‌ వద్ద గల టెలిఫోన్‌ ఎక్స్‌చేంజ్‌లో నైట్‌ వాచ్‌మన్‌గా రూ.4 వేల రూపాయల జీతంతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన రంజిత్.. గతేడాది డాక్టరేట్ సంపాదించడం విశేషం. ఇక కొన్ని నెలలు బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన తను.. ఇటీవలే ఐఐటీ రాంచీలో నూతన అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా నియమితులయ్యాడు. ఈ నేపథ్యంలోనే రంజిత్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ‘ఒక ఐఐటీ ఫ్రొఫెసర్ పుట్టిన ఇల్లు ఇది’ అని ఓ పూరిగుడిసె ఫొటో షేర్ చేశాడు. దీంతో ఆ పిక్ నెట్టింట్లో వైరల్ కావడంతో పాటు రంజిత్‌ స్టోరీ ఇన్‌స్పైర్‌గా ఉందని, అతడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇసాక్‌ కూడా రంజిత్‌కు అభినందనలు తెలిపారు.

‘ఓడిపోయానని భావించిన క్షణం నుంచి అతడు తన జీవితాన్ని మరింత చాలెంజింగ్‌గా తీసుకుని విజయాన్ని సాధించాడు. ఇది మనందరికీ ప్రేరణిచ్చే అంశం. అసాధారణ సంకల్ప శక్తితో దేశ మొదటి పౌరుడిగా ఎదిగిన కే ఆర్ నారాయణన్ సహా గొప్ప వ్యక్తుల జీవిత కథలు మన ముందున్నాయి. వాటి నుంచి స్ఫూర్తి పొందండి. వివిధ సంక్షోభాల కారణంగా నిరుత్సాహపడకుండా.. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి విద్యను ఆయుధంగా ఉపయోగించుకునే రంజిత్ వంటి వారి జీవితాలు అందరికీ స్పూర్తిదాయకం’ అని థామస్ తెలిపాడు.

‘విజయం కోసం పోరాడుతున్న వారికి నా జీవితం స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాను. నేను ఇంటర్ తర్వాత వాచ్‌మన్‌గా పనిచేస్తూనే పీఎస్‌ కాలేజ్‌ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తరువాత ఐఐటీ మద్రాస్‌లో సీటు సంపాదించాను. అప్పుడు నాకు మలయాళం మాత్రమే తెలుసు, ఆంగ్లం రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాను. చివరికి పీహెచ్‌డీ కోర్సు వదిలేద్దామనుకున్నాను. కానీ నా గురువు సుభాష్‌ సహకారంతో కోర్సు పూర్తిచేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరాను. పేదరికంతో పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేశాను కానీ ఈరోజు మాత్రం నేను అనుకున్నది సాధించాను. నా తండ్రి టైలర్‌ కాగా, మా అమ్మ కూలీ పని చేస్తుంది’ అని రంజిత్‌ తెలిపారు. ఇక ఈ పోస్ట్ వైరల్ కావడం పట్ల స్పందించిన రంజిత్.. ‘పోస్ట్ వైరల్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది మరికొందరికి స్ఫూర్తినిస్తుందనే ఆశతో నా జీవిత కథను పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరూ గొప్ప కలలు కనాలని, వాటి కోసం పోరాడాలని నేను కోరుకుంటున్నాను. ఇతర వ్యక్తులు దీని నుంచి ప్రేరణ పొందాలని, విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నాడు.

Next Story

Most Viewed