వాళ్లు మాకు 'నిమ్మ'లం లేకుండా చేస్తున్రు

by  |
వాళ్లు మాకు నిమ్మలం లేకుండా చేస్తున్రు
X

దిశ, నల్లగొండ: తెలంగాణలోనే ఏకైక నిమ్మ మార్కెట్ గా పేరుగాంచిన నకిరేకల్ నిమ్మమార్కెట్లో దళారులు రాజ్యమేలుతున్నారు. రైతులను నిలువునా ముంచుతూ మూడు పువ్వులుగా తమ దందా కొనసాగిస్తున్నారు. అండగా ఉండాల్సిన అధికార యంత్రాంగం.. ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లకు వంత పాడుతూ అవినీతికి పాల్పడుతున్నారు. ఇక్కడ ధరలు సూచించే డిస్‌‌ప్లే బోర్డులుండవు, పరిశీలించేందుకు అధికారులు ఉండరు. ఫలితంగా అధికారులు అందినకాడికి దోచుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా ఈ పంటపైనే ఆధారపడి సాగుచేస్తున్న రైతున్నకు మార్కెట్లో ఎదురువుతున్న సమస్యలు వినే నాథుడే కరువైయ్యారు.

నకిరేకల్ ప్రాంతంలో తెలంగాణలోనే అత్యధికంగా నిమ్మతోటలు సాగవుతాయి. దాదాపుగా ఇక్కడి నుంచే దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు నిమ్మకాయ ఎగుమతులు చేస్తుంటారు. ప్రస్తుత సీజన్‌లో ఇక్కడి నుంచి 20 లారీల నిమ్మ బస్తాలు ఇతర ప్రాంతాలకు వెళుతున్నాయంటే ఏ స్థాయిలో నిమ్మదిగుబడి వస్తుందో ఊహించుకోవచ్చు. కానీ, ఇతర రాష్ట్రాల్లో క్వింటాల్ నిమ్మకు రూ. 3500 నుంచి రూ. 4 వేలకు పైగా ధర పలుకుతుండగా నకిరేకల్ మార్కెట్‌లో మాత్రం క్వింటాల్‌కు రూ.1200 నుంచి రూ.1500 పడితే గగనమే అవుతుంది. గతేడాది మే నెలలో ఒక్క నిమ్మ బస్తాకు రూ.1500కు పైగా ధర పలుకగా ఈసారి మాత్రం రూ.500 ధర మించలేదు.

సిండికేట్‌గా మారిన ట్రేడర్లు..

ప్రతి రోజూ సాయంత్రం మార్కెట్ ప్రారంభమవుతుంది. అర్థరాత్రి సమయానికి సరుకు అంతా ఖాళీ అయిపోతుంది. అయితే మార్కెట్ ప్రారంభానికి ముందుగానే వ్యాపారులంతా ఒక నిర్ణయానికి వస్తుంటారు. అలా వచ్చిన నిర్ణయం మేరకు ఆరోజు వ్యాపారం నడుస్తుంది. ముంబై, ఆగ్రా, ఢిల్లీ వంటి పలు మార్కెట్లలో భారీగా ధర పలుకుతున్నా.. ఇక్కడ అందులో సగం ధర కూడా ఉండట్లేదు. నకిరేకల్ నిమ్మ మార్కెట్‌లో 32 మంది లైసెన్సు, ట్రేడర్లు, 30 మంది లైసెన్స్‌డ్ కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. నిమ్మ మార్కెట్‌లో వ్యాపారం నిర్వహించేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఒకే కుటుంబంలో ఇద్దరు లైసెన్సులు తీసుకున్నారు. భార్య కమీషన్ ఏజెంటుగా ఉంటే.. భర్త ట్రేడర్‌గా, లేకుంటే దగ్గరి బంధువులో కమీషన్ ఏజెంట్లుగా ఉంటూ రైతులను నిలువునా దోచేస్తున్నారు. కమీషన్ ఏజెంటు, వ్యాపారి ఒక్కరే కావడంతో వారి దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోన్నది.

రైతుకు అడివి.. కొనుగోలుదారుడికి కొరివి

నిమ్మకాయల రైతులకు ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంటుంది. రైతు ఒక్కో బస్తాను రూ.300 నుంచి రూ. 400కు విక్రయిస్తున్నాయి. ఒక్కో బస్తా 22 కేజీలు ఉంటుంది. ఆ బస్తాలో 600 కాయల వరకు ఉంటాయి. ఈ లెక్కన రైతు ఒక్క నిమ్మకాయను రూ. 50 పైసలు(అర్ధ రూపాయి)కు అమ్ముతున్నాడు. అదే సమయంలో వినియోగదారుడు మాత్రం బయటి మార్కెట్‌లో ఒక్కో నిమ్మకాయను రూ.3 నుంచి రూ.5కు పైగా కొనుగోలు చేస్తున్నాడు. ప్రస్తుతం నిమ్మకాయలను సేకరించేందుకు ఒక్క కూలీ మనిషికి రూ.200 నుంచి రూ.250 చెల్లించాలి. ఒక్క కూలీ రోజుకీ రెండు బస్తాల నిమ్మకాయలను సేకరిస్తాడు. ఆ బస్తాలను నిమ్మ మార్కెట్‌కు తరలించేందుకు ఒక్కో బస్తాకు రూ.15 నుంచి రూ.20 రవాణ ఛార్జీ అవుతుంది. ఈ లెక్కన రెండు బస్తాల నిమ్మకాలయను అమ్ముకోవాలంటే.. దాదాపు రూ.300 ఖర్చు అవుతుంది. ఆ రెండు బస్తాలను అమ్మితే రైతుకు రూ.600 కూడా వచ్చే పరిస్థితి లేదు.

దారి మళ్లుతున్న ఆదాయం

ప్రతి రోజూ మార్కెట్‌కు ఎంత నిమ్మకాయ వస్తుంది.. ఎంత పోతుందన్న దానిపై అధికారులు నామమాత్రపు లెక్కలు చూపుతున్నారు. నిత్యం మార్కెట్‌కు 30 వేల బస్తాలు వస్తుంటే రికార్డుల్లో కేవంల 3 వేల బస్తాలుగా నమోదు చేస్తున్నారు. దీంతో మార్కెట్ ఫీజు రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా దారి మళ్లుతోన్నది. అధికారులు ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లతో కుమ్మకై.. ఈ తతంగానికి పాల్పడుతున్నారు. వాస్తవానికి నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ అధికారులకు ప్రస్తుతం ఏ పనీ లేదు. కట్టుదిట్టంగా వ్యవహరించి మార్కెట్ కు రాబడి తేవాల్సిందిపోయి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిమ్మ మార్కెట్ నుంచి నిత్యం 20 లారీలు వెళుతుంటాయి. వాటికి 25 శాతం పన్ను వసూలు చేయడం లేదు.

డిస్‌ప్లే బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యం..

నకిరేకల్ మార్కెట్లో ధరలు సూచించే బోర్డులు మచ్చుకైనా కానరావు. దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో క్వింటాల్‌కు ఎంత ధర పలుకుతున్నదో తెలిపేలా ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు రైతులు ఎప్పటి నుంచో కోరుతున్నాఅధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీనికి కారణంలో నెలనెలా ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల నుంచి భారీగా ముడుపులు అందడమేనని రైతాంగం ఆరోపిస్తోన్నది. దీనికితోడు నిమ్మ అమ్మకాలకు సంబంధించి మార్కెట్ పేరు మీద తక్ పట్టి(సరుకు అమ్మకం వివరాలు) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఇవేవీ ఇవ్వకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. నిమ్మ మార్కెట్లో ఖచ్చితంగా ధరలు సూచించే ఎలక్ట్రానిక్ బోర్డులు ఏర్పాటు చేయాలి. రోజూకూ ఎన్ని బస్తాలు వస్తున్నాయి, ఎన్ని వెళ్తున్నాయనే వివరాలు వెల్లడవుతాయి. ధరల డిస్ ప్లే బోర్డు ఏర్పాటు అయితే రైతుకు కొంతైనా న్యాయం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఏ మార్కెట్ ఏం ధర పలుకుతుందనే విషయం రైతుకు తెలిసిపోతుంది.

అధికారుల నిర్లక్ష్యమే శాపం: యానాల కృష్ణారెడ్డి

గత 20 ఏండ్లుగా నిమ్మతోటలను సాగు చేస్తున్నా. తెలంగాణలోనే ఏకైక నిమ్మమార్కెట్ నకిరేకల్ ప్రాంతంలో వచ్చిందని సంతోషించాం. కానీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల అది కాస్త ఆవిరైపోయింది. రైతుల పక్షాన నిలబడాల్సిన కొందరు ట్రేడర్లు, కమీషన్ ఏజంట్లకు తొత్తులుగా మారారు. మార్కెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండట్లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చొరవ తీసుకోవాలి.


Next Story

Most Viewed