‘రియల్’ మోసం.. 100 శాతం అడ్వాన్స్ వసూళ్లు​

by  |
real estate companies
X

సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకొనే ఎగువ మధ్యతరగతికి బడా రియల్ ఎస్టేట్ సంస్థలు గాలం వేస్తున్నాయి. రకరకాల ఆపర్ల పేరిట వారిని ఆకర్షించి మొత్తం డబ్బులు వసూలు చేసుకుంటున్నాయి. రకరకాల వివాదాల కారణంగా ప్రతిపాదిత భూముల్లో పునాది రాయి పడటం లేదు. ఏండ్లు గడిచినా డబ్బలు తిరిగి ఇవ్వలేదు. గట్టిగా అడుగుదామంటే ఆ కంపెనీకి రాజకీయ పలుకుబడి ఎక్కువ. కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని మిన్నకుండి పోతున్నారు. తాజాగా కొండాపూర్​, నానక్​రాంగూడ, హైటెక్​సిటీ, మియాపూర్​, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట ప్రాంతాల్లో అతి భారీ ప్రాజెక్టులు అనేకం రూపుదిద్దుకుంటున్నాయి. వీటి ఆఫర్లపై అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే అడుగేయాలని రియల్​ఎస్టేట్​నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండేండ్ల క్రితం

మియాపూర్.. ఐటీ కారిడార్ కు సమీపంలో ఉండే ప్రాంతం. ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ అందమైన బ్రోచర్లులో ఆకాశ హర్మ్యాలను చూపింది. మంచి తరుణం మించిన దొరకదు అంటూ ప్రమోట్ చేసింది.10 ఎకరాల సువిశాల స్థలం.. క్లబ్​హౌజ్​. హై రైజ్​బిల్డింగు. బ్లాకులు.. సకల సౌకర్యాలు. భూతల స్వర్గమే.. అంటూ ప్రాజెక్టును ప్రతిపాదించింది. సగం ధరకే ఫ్లాట్ అని, రెండేళ్లలో మీ సొంతింటి తాళం చెవి ఇచ్చేస్తామని చెప్పింది. పనులు ప్రారంభించకుండానే వందశాతం అడ్వాన్స్ తీసుకొని ఫ్లాట్లు అమ్మేసింది. దాదాపు 300 మందితో 100శాతం డబ్బలు కట్టించుకున్నది. ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. ఆ స్థలంలో వివాదాలు తలెత్తాయి. అనుమతులు రాలేదు. ఆ కంపెనీ ఫ్లాట్ల కోసం తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదు. గట్టిగా అడుగుదామంటే ఆ కంపెనీకి రాజకీయ పలుకుబడి ఎక్కువ. కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని డబ్బలు కట్టిన వారు అడగటం లేదు.

ప్రస్తుతం

మళ్లీ ఇదే తరహా వ్యవహారం మొదలైంది.. విల్లల్లాంటి ఫ్లాట్లు, హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే.. మూణ్నాళుగేళ్లలోనే హ్యండోవర్ చేస్తాం.. జిమ్, స్విమ్మింగ్ ఫూల్, ఇండోర్ స్టేడియం, ఆట స్థలాలు ఇలా అన్నీ ఒకే చోట అంటూ చదరపు గజాన్ని రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకే.. అదీ హైటెక్ సిటీకి దగ్గర్లో.. అంటూ ఓ బడా కంపెనీ బేరం మొదలు పెట్టింది. మొదటి 20 బుకింగ్స్ కు ఈ ఆఫర్ ప్రకటించింది. ఫుల్ పేమెంట్ చేస్తే అగ్రిమెంట్ అంటూ ప్రధాన భవన నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగాయి. కొండాపూర్​, నానక్​రాంగూడ, హైటెక్​సిటీ, మియాపూర్​, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట ప్రాంతాల్లో అతి భారీ ప్రాజెక్టులు అనేకం రూపుదిద్దుకుంటున్నాయి. వీటి ఆఫర్లపై అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాతే అడుగేయాలని రియల్​ఎస్టేట్​నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే ఆతృత ఉన్నా, అనుమతులున్నాయా? ఆ స్థలం ఎవరిది? ఎలా సంక్రమించింది.? అన్న విషయాలపై అధ్యయనం చేయకుండా వాటి జోలికి వెళ్లొద్దని నిపుణులుు సూచిస్తున్నారు. ఆఫర్లు ప్రకటించే ప్రాజెక్టుల ప్రతిపాదిత స్థలాల్లో ఎలాంటి వివాదాలు లేవా? అన్ని సరిగ్గా ఉన్నాయా? నిర్మించతలపెట్టిన కంపెనీకి అన్ని రకాల​హక్కులు ఉన్నాయా? ఆ స్థలాన్ని విక్రయించిన పట్టాదారుడు, ఆయన వారసులతో ఎలాంటి గొడవలు లేవా? ఇలాంటి అంశాలన్నీ తర్కించుకోకపోతే కట్టిన 100 శాతం డబ్బులకు గ్యారంటీ లేదని రియల్ ​ఎస్టేట్​ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడా బడా కంపెనీలే ఈ ఆఫర్లను ఎక్కువగా ప్రకటిస్తున్నాయి. కానీ వాటిపైనా వివాదాలేవీ రావని ఎవరూ చెప్పలేరు.

బహుళం.. కష్టాలు

– హైటెక్​సిటీకి అత్యంత సమీపంలోనే ఓ బడా కంపెనీ ఇలాంటి ఆఫర్లను ప్రకటించింది. గుట్టుచప్పుడు కాకుండా వారికి తెలిసిన కస్టమర్ల ద్వారానే ప్రచారం చేస్తోంది. ఈ ప్రాంతంలో చదరపు అడుగు ధర రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు కచ్చితంగా ఉంటుంది. కానీ ఆఫర్​ధర చదరపు అడుగుకు కేవలం రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకే అని నిర్ణయించింది. ప్రాజెక్టుకు రెరా అనుమతి కూడా లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి అనుమతులు రాకముందే విక్రయాలు మొదలు పెట్టొచ్చునా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
– కొండాపూర్​ఏరియాలో మరో పెద్ద భవన నిర్మాణ సంస్థ 15 ఎకరాల్లో ప్రాజెక్టును ప్రతిపాదించింది. ప్రతిపాదనతోనే ప్రీ లాంచ్ ​ఆఫర్​ను ప్రకటించింది. 15 నుంచి 22 అంతస్తుల వరకు ప్లాన్​చేస్తోంది. డబుల్​, త్రిబుల్​ బీహెచ్ కే ఫ్లాట్లను నిర్మిస్తామంటోంది. కేవలం రూ.6 వేల నుంచి రూ.7 వేలేనంటూ ప్రచారం చేస్తోంది. అది కూడా తెలిసిన వారికే అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్​లో లాంచింగ్​చేయబోతున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. లాంచింగ్ ప్రైస్​ చదరపు అడుగుకు కేవలం రూ.3,500 నుంచి రూ.4 వేలుగా నిర్ణయించింది. కొండాపూర్​ప్రాంతంలో ఇంత తక్కువ ధరకే అంటే మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
– ఫైనాన్షియల్​డిస్ట్రిక్ట్​లోనే నాలుగు టవర్లు, 30 అంతస్తుల భవనాలు.. 1000 కి పైగా ఫ్లాట్లు. ఆఫర్ ప్రైస్​కేవలం చ.అ.కు రూ.4000 మాత్రమే. ఓ పెద్ద కంపెనీ ప్రకటించింది. పూర్తి చేసేందుకు ఐదేండ్లు కూడా పట్టొచ్చు.
– ఇలా ఐటీ కారిడార్ కు అత్యంత సమీపంలోని జీహెచ్ఎంసీ, నార్సింగి, మణికొండ, బండ్లగూడ మున్సిపాలిటీ ప్రాంతాల్లో అతి భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ ఆ స్థలాల్లో అనుకున్న రీతిలో ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తాయా? ఆ స్థలంలో ఎలాంటి వివాదాలు లేవన్న గ్యారంటీ ఎవరిస్తారు? డబ్బులు పూర్తిగా చెల్లించిన తర్వాత ప్రాజెక్టు నిలిచిపోతే ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

దాచుకున్న సొమ్మంతా..

ప్రైవేటు ఉద్యోగుల ఖాతాల్లోని సొమ్మంతా ప్రైవేటు కంపెనీ ఖాతాల్లోకి వెళ్తోంది. దాచుకున్న సొమ్మంతా ఆఫర్ల ప్రకటనలతో నమ్మేసి కట్టేస్తున్నారని తెలిసింది. ఎన్నో ఏండ్లుగా దాచుకున్న డబ్బులన్నీ బడా సంస్థలు వసూలు చేస్తున్నాయి. రెరా అనుమతులు లేవు. హెచ్ఎండీఏ ఉత్తర్వులు లేవు. భూమి పూజ లేదు. అంతా కాగితాల్లో చూపించేసి 100 శాతం అడ్వాన్సుల పేరిట ప్రపంచ స్థాయి నైపుణ్యం కంపెనీలే వసూళ్లు చేస్తున్నాయి. ప్రీ లాంచింగ్​ఆఫర్ల పేరిట ప్రచారానికే రూ.లక్షలు ఖర్చు చేస్తున్నాయి. అందమైన హై రైజ్​బిల్డింగుల బొమ్మలేసి, సకల సదుపాయాల మాటలు వినిపించి మార్కెట్​ధర కంటే సగానికే ఇండ్లనిస్తామంటున్నాయి.తే ఏదో చిన్న చిన్న కంపెనీల ప్రకటనలు కావివి.. అన్ని రకాల హంగులు, పలుకుబడి కలిగిన బడా నిర్మాణ సంస్థలే ఈ రకమైన విక్రయాలకు నడుంబిగించాయి. ప్రశ్నిస్తే కష్టాలు ఎదురవుతాయని ఏ అధికారి చర్యలకు సాహసించడం లేదు. కనీసం అనుమతులు పొందకుండానే అమ్మకాలు సాగించొద్దన్న చైతన్య కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


Next Story