కరీంనగర్‌లో రెమిడెసివిర్ బ్లాక్ దందా.. నలుగురి అరెస్టు!

by  |
కరీంనగర్‌లో రెమిడెసివిర్ బ్లాక్ దందా.. నలుగురి అరెస్టు!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రెమిడెసివర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లలో విక్రయిస్తున్న ముఠా సభ్యులపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు శుక్రవారం నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. కరీంనగర్‌లోని కిసాన్ నగర్‌కు చెందిన దాసరి సురేష్, ముకరంపురకు చెందిన బాలగొని సత్యనారాయణ, కట్టరాంపూర్‌కు చెందిన కొత్తకొండ వెంకటసాయిలులు వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న బొమ్మకంటి నరేష్‌తో సంబంధాలు పెట్టుకుని రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.20 నుండి రూ.25 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. నలుగురు నిందితులను కిసాన్ నగర్‌లో అదుపులోకి తీసెుకుని విచారించగా 18 రెమిడిసివిర్ ఇంజక్షన్లు, రూ.40 వేల నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని కరీంనగర్ త్రీ టౌన్‌లో కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్లు బి మల్లయ్య, కె సృజన్ రెడ్డి, త్రీ టౌన్ సీఐ విజ్ఞాన్ రావు, ఎస్సై పి కరుణాకర్‌లు పాల్గొన్నారు.

క్రిమినల్ కేసులు తప్పవు : సీపీ

రెమిడిసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్కు తరలించి అడ్డగోలు ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ సీపీ విబీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. కృత్తిమ కొరత సృష్టిస్తున్న తీరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, ఇందుకోసం స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ ముఠా సభ్యులతో కొన్ని ఆసుపత్రుల వారు చేతులు కలిపారని, అవసరం లేకపోయినా మందులు కావల్సిందేనంటూ బాధితులను భయాందోళనకు గురి చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని సీపీ వివరించారు. ఈ ఆసుపత్రులపై కూడా సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో దాడులు చేసి తీరుతామన్నారు. బ్లాక్ మార్కెట్ దందా గాళ్లు తమ విధానాలకు స్వస్తి చెప్పాలని లేనట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.

Next Story

Most Viewed