‘రూ.25 కోట్ల అవినీతి.. ఆరేండ్లు గడిచింది’

by  |
‘రూ.25 కోట్ల అవినీతి.. ఆరేండ్లు గడిచింది’
X

దిశ, క్రైమ్ బ్యూరో: సహకార బ్యాంకులో రూ.25 కోట్ల అవినీతి కేసులో విచారణ వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. అంతేగాకుండా ఈ కేసు విచారణను సత్వరమే పూర్తయ్యేలా రాష్ట్ర సీఎస్‌కు ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్ డాక్టర్ తమిళిసైను కోరుతూ మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం పద్మనాభరెడ్డి మాట్లాడుతూ… నల్లగొండ జిల్లా దేవరకొండ కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని ఏడు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో(పీఏసీఎస్) 2009 నుంచి 2013 వరకూ దాదాపు రూ.25 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దీనిపై దేవరకొండ పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత జిల్లా కలెక్టర్ ఈ కేసును సీఐడీకి అప్పగించాలని 2014 మార్చిలో ప్రభుత్వానికి నివేదిక పంపిందని తెలిపారు.

అనంతరం 2015లో ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ.. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు గుర్తు చేశారు. అయితే, అవినీతి జరిగి ఆరేండ్లు అవుతున్నా.. నేటికీ ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదన్నారు. ఈ కేసుపై 2017, 2020లో కేసు పురోగతి గురించి సమాచార హక్కు చట్టం ప్రకారం సీఐడీని కోరగా విచారణలో ఉందనే సమాధానాన్ని మాత్రమే చెబుతున్నారన్నారు. గతంలో ఈ కేసుపై జాయింట్ కలెక్టర్ విచారించారని, ఇంకా ఈ కేసులో విచారణ చేయాల్సినవి చాలా కొద్దివి మాత్రమే ఉంటాయని వెల్లడించారు. అయితే, ఆరేండ్లుగా సీఐడీ ఈ కేసు దర్యాప్తును నత్త నడకన నడుస్తుండటంతో సీఐడీ దర్యాప్తుపై అనుమానాలు కలుగుతున్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా కేసు దర్యాప్తు పూర్తి చేసి అక్రమార్కుల నుంచి ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయాలని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed