కేసీఆర్‌కు బిగ్‌షాక్.. ‘దళిత బంధు’ పై సీఈసీకి ఫిర్యాదు

by  |
cm-kcr-shock
X

దిశ, తెలంగాణ బ్యూరో : దళితబంధు పథకం అమలును హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకు నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికిప్పుడు దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించినట్లయితే అక్కడ మినహా మిగిలిన 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలుచేసేలా చర్యలు తీసుకోవచ్చని సూచించింది. ఫోరమ్ కార్యదర్శి పద్మనాభరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బుధవారం రాసిన లేఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉదహరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో లేనప్పటికీ ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకునే దళిత బంధును అమలు చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆ లేఖలో ప్రస్తావించారు.

దళిత బంధు స్కీమ్ మంచిదే అయినా ఇప్పుడు హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో తెరపైకి తీసుకురావడం హుజూరాబాద్ ఓటర్లను ప్రలోభపెట్టడమేనని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ పథకం ఎన్నికలలో లాభం కోసమేనని ప్రకటించడం తీవ్రమైన అంశమని, ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించాల్సిన గురుతరమైన బాధ్యత ఉన్నందున ఎన్నికలకు ముందే కోట్లాది రూపాయలతో పథకాలను రూపొందించడం ఓటర్లను ప్రలోభానికి గురిచేయడమేనని నొక్కిచెప్పారు. “నేను హిమాలయాల్లో ఉండే సాధువును కాదు.. ఒక రాజకీయవేత్తను.. దళిత బంధు పథకం ఉప ఎన్నికలలో లబ్ధి పొందడానికే.. దీనిలో తప్పేంటి” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఎన్నికల కోడ్ అమలులో లేనందున ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాకపోవచ్చు గానీ సమర్ధనీయం కాదని పేర్కొన్నారు.

ఇప్పటికే హుజూరాబాద్ నుంచి దళితులను హైదరాబాద్ పిలిపించుకుని చర్చించడం, వారికి లాభపడే మరికొన్ని పథకాలను ఆ సమావేశంలో ప్రకటించడం, ఇల్లు లేని వారికి ఇల్లును సమకూర్చడం, పది రోజుల్లోనే పట్టాదారు పాసు బుక్కులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం, గొర్రెల పంపిణీ, రేషను కార్డుల జారీ, పింఛన్ల మంజూరు.. ఇవన్నీ స్వాగతించాల్సినవి అయినప్పటికీ వీటి వెనక ఉద్దేశం మాత్రం ప్రశ్నార్థకమని పేర్కొన్నారు.


Next Story