హుజురాబాద్‌‌లో రూ.300 కోట్లు ఖర్చు.. సిద్ధంగా మరో 400కోట్లు..!

by  |
huzurabad-expence
X

దిశప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రూ. 300 కోట్లు ఖర్చు చేసింది. మరో రూ. 400 కోట్ల ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. ఈ మేరకు భారత ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. గొనె ప్రకాష్ రావు రాసిన ఈ లేఖలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. హుజూరాబాద్‌లో జరుగుతున్న ఈ వ్యవహారాలను నియంత్రించడంతో పాటు వెంటనే ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. టీఆర్ఎస్ ఖర్చు చేస్తున్న డబ్బులపై నిఘా పెట్టాలని, పార్టీ నాయకులకు సన్నిహితంగా ఉన్న ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ కంపెనీలు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, ప్రధానమైన రియాల్టర్లపై దృష్టి సారించాలని గొనె ప్రకాష్ రావు కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, పోలీసుల సాయంతో కేసులు బనాయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

నిఘా వర్గాలను రంగంలోకి దింపి ఈటల రాజేందర్‌తో పాటు ఇతర పార్టీల్లో తిరుగుతున్న యువతను గుర్తించి రాత్రి వేళల్లో వారి తల్లిదండ్రులకు హెచ్చరికలు చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలను దింపాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను గొనె ప్రకాష రావు అభ్యర్థించారు. బోగస్ ఓట్లు కూడా నమోదయ్యాయని వాటిని తొలగించేందుకు కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తరువాత హుజురాబాద్‌లో పనిచేస్తున్న అధికార యంత్రాంగాన్ని బదిలీ చేసి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇచ్చారన్నారు. వివిధ శాఖల ద్వారా వ్యాపారులను కూడా బెదిరిస్తున్నారని చెప్పారు.

ఇక్కడ తిరుగుతున్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై కూడా నిఘా పెట్టాలని లేఖలో కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, ఓటింగ్ ప్రక్రియను ఎగతాలి చేసే చర్యలకు పూనుకుంటున్నారని గోనె ప్రకాష్ రావు సీఈసీకి రాసిన లేఖలో వివరించారు. దేశ చరిత్రలోనే హుజురాబాద్ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారాయని గొనె ప్రకాష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నికలను నిర్వహించేందుకు చొరవ చూపాలని ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కోరారు.

యువరాజుకు కలిసొచ్చిన ‘సెంటిమెంట్’

Next Story

Most Viewed